ఏమో ఇప్పుడు తేజను చూస్తుంటే ఇదే అనుమానం వస్తుంది. అరె ఒకప్పుడు ఏడాదికి కనీసం ఒక్క సినిమా చేసే దర్శకుడు.. ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు. పైగా 15 ఏళ్ల తర్వాత గతేడాది నేనేరాజు నేనేమంత్రి అంటూ హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమా హ్యాంగోవర్ ఇంకా దిగనట్లే ఉంది. అందుకే ఇప్పటికీ నేనేరాజు నేనేమంత్రి అంటున్నాడు. తన పొగరు అనుకోవాలో.. లేదంటే ఆత్మవిశ్వాసం అనుకోవాలో..
అదీ కాదంటే అదో రకం అనుకోవాలో తెలియడం లేదు కానీ వచ్చిన అవకాశాలు కూడా వదిలేస్తున్నాడు ఈ సీనియర్ దర్శకుడు. మొన్నటి వరకు చేతిలో రెండు భారీ సినిమాలు ఉండేవి కానీ ఇప్పుడు ఏం లేవు. బాలయ్యతో చేయాల్సిన ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోయింది. దానికి కారణం ఆయనకు బాలయ్యతో వచ్చిన క్రియేటివ్ డిఫెరెన్సెస్ అని తెలుస్తుంది. వెంకటేశ్ సినిమా కూడా ఎందుకు ఆగిపోయిందో క్లారిటీ లేదు. ఈ రెండు సినిమాలు ఆగిపోవడంతో ఇప్పుడు నెక్ట్స్ ఏం చేయాలా అనే కన్ఫ్యూజన్ మొదలైంది.
ఆ మధ్య ఉదయ్ కిరణ్ బయోపిక్ చేస్తాడనే వార్తలొచ్చినా నిజం లేదని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ కాంబినేషన్ లో తేజ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఇప్పటికే అనూప్ రూబెన్స్ తో కలిసి తేజ ట్యూన్స్ కూడా ఫైనల్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. పైగా తనకు కావాల్సిన దగ్గర కాజల్ కూడా ఈ చిత్రం గురించి కన్ఫర్మేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి కనీసం బెల్లంకొండ సినిమా అయినా పట్టాలెక్కుతుందా.. లేదంటే ఇది కూడా ఇలాగే ఆగిపోతుందా అనేది చూడాలిక..!