తప్పదు.. ఒక్కసారి కెరీర్ లో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు బన్నీకి కూడా వచ్చింది. ఇదివరకు ఓ సినిమా పూర్తి కాగానే.. మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన అల్లుఅర్జున్.. ఇప్పుడు నా పేరు సూర్య విడుదలై రెండు నెలలు పూర్తైనా ఇప్పటి వరకు మరో సినిమా ఏంటి అనేది కూడా చెప్పట్లేదు. దానికి కారణం నా పేరు సూర్య ఫ్లాప్ అవ్వడమే కాదు.. సరైన కథ దొరక్కపోవడం కూడా.
ఏడేళ్ల తర్వాత నిఖార్సైన ఫ్లాప్ తగలడంతో తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఒకటి రెండు కాదు.. ఏకంగా 30 కోట్లకు పైగా నష్టాల్ని తీసుకొచ్చాడు నా పేరు సూర్య. దాంతో ఈ సారి ఏ ప్రయోగాలు లేకుండా పక్కా కమర్షియల్ కథ ఒకటి సిద్ధం చేయాల్సిందిగా తన దగ్గరికి వస్తున్న దర్శకులకు చెబుతున్నాడు బన్నీ.
ఎవరు మంచి కథ తీసుకొస్తే వాళ్లతో సినిమా చేయడానికి బన్నీ సిద్ధంగా ఉన్నాడిప్పుడు. కాకపోతే ఆ కథ రావడం ఆలస్యం అంతే. ఇప్పటికే విక్రమ్ కే కుమార్ చెప్పిన కథ ఒకటి నచ్చిందని తెలుస్తుంది. అయితే అందులో మార్పులు చేయాల్సిందిగా బన్నీ కోరుతున్నాడు. సెకండాఫ్ ను ఇప్పుడు హీరోకు నచ్చే విధంగా మార్చే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు. దాంతోపాటు కొరటాల అనుకున్నా ఇప్పట్లో ఇది లేదని తేలిపోయింది.
ఈయన ప్రస్తుతం చిరంజీవి కోసం కథ రాస్తున్నారు. తాజాగా గీతగోవిందం ఆడియో వేడుకకు వచ్చిన బన్నీ.. తర్వాతి సినిమా ఏంటి అంటే తెలిసిన తర్వాత చెప్తానంటూ అభిమానులకు సముదాయించాడు. ఈయన తీరు చూస్తుంటే ఇప్పట్లో బన్నీ నుంచి సినిమాలు ఊహించడం కష్టమే.