గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య‌ల‌కు చిరంజీవి 4ల‌క్ష‌లు ఆర్ధిక‌ స‌హాయం

క‌మెడియ‌న్ గుండు హ‌నుమంతురావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప‌డుతోన్న నేప‌థ్యంలో టెలివిజ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే `అలీతో జాలీ`గా షో ద్వారా గుండు ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను  `మా` మూవీ ఆర్టిస్ట్  అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా ద్వారా అంద‌జేశారు. `మా` జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, ఎగ్యిక్యూటివ్ మెంబ‌ర్ సురేష్ స్వ‌యంగా అపోలో అసుప‌త్రికి వెళ్లి చెక్ అందించారు. అనంత‌రం గుండు హ‌నుమంతురావు త‌న అనారోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా చిరంజీవి గారితో కాసేపు ఫోన్ లో ఉత్సాహంగా మాట్లాడారు.
అలాగే మ‌రో క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య ఆర్ధిక ప‌రిస్థితుల‌ను చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ పేప‌ర్లో చ‌దివి చ‌లించిపోయారు. త‌మవంతు స‌హాయంగా వీర‌య్య కుటుంబానికి కూడా 2ల‌క్ష‌ల రూపాయ‌లు స‌హాయం చేసారు. వీర‌య్య ను `మా` ఆఫీస్ కు పిలిపించి శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ చేతుల మీదుగా 2ల‌క్ష‌ల చెక్ ను అందించారు.
ఈ సంద‌ర్భంగా `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, -` రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేసి శివాజీ అర్జెంట్ గా ఇంటికి రా అన్నారు. వెంట‌నే  శ్రీరామ్, నేను వెళ్లాము. గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య క‌ష్టాల్లో ఉన్నట్లున్నారు..వెంట‌నే వాళ్లిద్ద‌రికీ చెరో రెండు ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని చెక్ లు ఇచ్చారు. ఆయ‌న ఇచ్చిన అర‌గంట‌లోనే ఇద్ద‌రికీ చెక్ లు అందించాం. చిరంజీవి గారు చాలా సంతోషించారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా…ఎవ‌రు క‌ష్టాల్లో ఉన్నా నాకొచ్చి చెప్పు. స‌హాయం చేద్దాం అన్నారు. ఈ విష‌యంలో నేను `మా` అధ్య‌క్షుడిగానే కాకుండా న‌టుడిగా చాలా సంతోషించాను. హ్యాట్సాఫ్ చిరంజీవి గారు` అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here