నితిన్ కొత్త సినిమా ఛల్ మోహన్ రంగా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమా చూసిన తర్వాత యూనిట్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఛల్ మోహన్ రంగా చాలా బాగా వచ్చిందని.. ఈ చిత్రంతో కచ్చితంగా నితిన్ కు పెద్ద విజయం వస్తుందని ధీమాగా చెబుతున్నారు సెన్సార్ సభ్యులు. అంతేకాదు.. సినిమాలో ఒకే ఒక్క ఫైట్ సీక్వెన్స్ ఉందని.. కామెడీ దీనికి ప్రాణంగా నిలిచిందని తెలుస్తుంది. ఇక మేఘాఆకాశ్ గ్లామర్ షో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. మూడు రోజుల ముందే ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. లై డిజాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో నితిన్ కు ఈ చిత్రంపై చాలా ఆశలే ఉన్నాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలు కావడం.. త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ అందించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర రంగస్థలాన్ని తట్టుకుని నిలబడాలి ఈ ఛల్ మోహన్ రంగా. కృష్ణచైతన్య తెరకెక్కించిన ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్ అయింది. మరి చూడాలిక.. రేపు సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆడుతుందో లేదో..?