అవును.. ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఒక్క సినిమా ఫ్లాప్ అయినందుకే ఇప్పుడు రికార్డుల తాట తీస్తున్నాడు సల్మాన్ ఖాన్. గత సినిమా ట్యూబ్ లైట్ ఫ్లాప్ అయిందనో కసో ఏమో కానీ ఇప్పుడు టైగర్ జిందా హై రికార్డులను మామూలుగా వేటాడట్లేదు. అసలు బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూడని రికార్డులకు తెర తీస్తున్నాడు ఈ పులి. తొలిరోజు నుంచే ఈ దూకుడు చూపిస్తున్నాడు టైగర్. రానురాను అది తగ్గుతుందేమో అనుకుంటే.. ఇంకా పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ చిత్రం వారం రోజుల్లోనే 190 కోట్లు ఇండియాలో.. ఓవరాల్ గా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాహుబలి 2ను పక్కనబెడితే.. ఇండియాలో ఏ సినిమాకైనా ఇది అత్యధిక వసూళ్లు. వరసగా 12వ సారి 100 కోట్లు.. కెరీర్లో 8వ సారి 200 కోట్ల మార్క్ అందుకున్నాడు సల్మాన్ ఖాన్.
టైగర్ జిందా హై ఏ, బి, సి సెంటర్లు అని తేడా లేకుండా అన్ని చోట్లా ఇరగదీస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ తో సల్మాన్ గతంలో చేసిన సుల్తాన్ కూడా 600 కోట్లు వసూలు చేసింది. దబంగ్ నుంచి మొదలుకొని రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబంగ్ 2, జైహో, కిక్, భజరంగీ భాయీజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్.. వరసగా 100 కోట్ల క్లబ్ లో చేరాయి. తాజాగా 12వ సారి 100 కోట్లు కొల్లగొట్టాడు సల్మాన్. బాలీవుడ్ లో అత్యధిక బిలియన్ సినిమాలున్న హీరో కూడా సల్మానే. సుల్తాన్ జోరు చూస్తుంటే వరల్డ్ వైడ్ గా 500 కోట్లు.. ఇండియాలో 300 కోట్ల సినిమా వచ్చేలా కనిపి స్తుంది. జనవరి 1 వరకు బాలీవుడ్ లో మరో సినిమా లేదు. దాంతో టైగర్ వేటకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. చూస్తుంటే లాంగ్ రన్ లో సుల్తాన్ రికార్డులకు చెక్ పెట్టేలా ఉన్నాడు సల్మాన్. ఇండియాలో ఈ చిత్రం 310 కోట్లు వసూలు చేసింది. మరి చూడాలిక.. టైగర్ ప్రయాణం ఎంతదూరంలో ఆగనుందో..?