అరవోళ్లను అస్సలు తక్కువంచనా వేయకూడదు. మిల్లీమీటర్ సందిస్తే కిలోమీటర్ దూరేస్తుంటారు వాళ్లు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు.. వాళ్లను ఆపడం ఎవరి తరం కాదు. ఇక మన దర్శకులు కూడా తెలుగులో ఆర్టిస్టులే లేనట్లే అంతా వాళ్ల వెంటనే పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పోటీ పడి మరీ మన దర్శకులంతా తమిళ మాజీ హీరోల వెంటే పడుతున్నారు. ఈ మధ్య సత్యరాజ్ కు తెలుగులో ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు శరత్ కుమార్, అర్జున్ వెంట పడుతున్నారు దర్శకులు. ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్ లై సినిమాలో విలన్ గా నటించాడు. ఇక శరత్ కుమార్ కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై దృష్టి పెట్టాడు. పదేళ్ల కింద బన్నీలో బన్నీ తండ్రిగా నటించిన శరత్ కుమార్.. ఇప్పుడు భరత్ అనే నేనులో మహేశ్ తండ్రిగా నటించబోతున్నాడు. భరత్ అను నేనులో శరత్ కుమార్ హీరోతో సమానమైన పాత్ర చేస్తున్నాడు. జయ జానకీ నాయకాలోనూ హీరో తండ్రిగా నటించాడు శరత్ కుమార్.
ఇప్పుడు బన్నీ నా పేరు సూర్యలో కూడా శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. ఇది విలన్ పాత్ర అని తెలుస్తుంది. ఇదే సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. బన్నీ తండ్రి పాత్ర ఇది. కుర్ర హీరో ఆది పినిశెట్టి కూడా తెలుగులో బాగా బిజీ అయిపోయాడు. సరైనోడులో విలన్ గా మెప్పించిన ఆది.. నిన్నుకోరిలో సపోర్టింగ్ రోల్ తో పిచ్చెక్కించాడు. ఇప్పుడు అజ్ఞాతవాసిలో కుర్ర బిజినెస్ మ్యాన్ గా నటించాడు. రంగస్థలంలో రామ్ చరణ్ కు అన్నయ్యగా కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. మొత్తానికి అటు సత్యరాజ్.. ఇటు శరత్ కుమార్.. ఇంకోవైపు ఆది పినిశెట్టి.. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఇలా అరవ బ్యాచ్ అంతా తెలుగు ఇండస్ట్రీని కబ్జా చేస్తున్నారిప్పుడు.