ఎమ్మెల్యే.. ఈ మాట వినగానే ముందు రాజకీయాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గుర్తొస్తున్నాడు. ఈ పేరుకు అంతగా ఫిక్స్ అయిపోయాడు కళ్యాణ్ రామ్. ఈయన నటించిన సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మార్చ్ 23న సినిమా విడుదలైనా.. ముందు రోజు రాత్రి నుంచే వరసగా ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఓపెనింగ్స్ పై నమ్మకంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. పైగా పటాస్ తర్వాత ఈయనకు హిట్ లేదు. తర్వాత వచ్చిన షేర్.. యిజం ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఎమ్మెల్యే కీలకంగా మారింది. ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. కొత్త దర్శకులు కళ్యాణ్ రామ్ కు బాగానే కలిసొచ్చారు. ఈయన కెరీర్ ను నిలబెట్టిన అతనొక్కడే.. పటాస్ లాంటి సినిమాలు చేసింది కొత్త దర్శకులే. ఇప్పుడు ఉపేంద్ర మాధవ్ కూడా కొత్త దర్శకుడే. పైగా పటాస్ తర్వాత అంత సేపు విన్న కథ ఇదే అని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఇదే సినిమాపై తనకున్న నమ్మకం ఏంటో చూపిస్తుంది. అదీ కాక ఓవర్సీస్ లో ఈ చిత్రం ఏకంగా 300 స్క్రీన్స్ లో పడుతుంది. మొత్తానికి చూడాలిక.. కళ్యాణ్ రామ్ కెరీర్ ను ఎమ్మెల్యే ఎంతవరకు నిలబెడుతుందో..?