పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆయన ఇమేజ్ లెక్కేయాలంటే కొత్తగా ఏదైనా పరికరం కనిపెట్టాలి. అంత ఇమేజ్ ఈయన సొంతం. ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అని తపస్సు చేసే దర్శకులు ఉన్నారు. పవన్ కూడా తనకు ఈ దర్శకులే కావాలని ఏ రోజు పట్టుపట్టలేదు. తన ఇమేజ్ కంటే వంద రెట్లు తక్కువగా ఉన్న దర్శకులతోనూ సినిమాలు చేసాడు. ఈ మధ్య కాలంలో ఒక్క అజ్ఞాతవాసి మినహా అన్ని చిన్న దర్శకులతోనే చేసాడు. అయితే అన్నీ ఫ్లాపులే అది వేరే విషయం. కాకపోతే ఈయనతో సినిమా అంటే ఎప్పుడు మొదలై.. ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పడం కష్టం. ఆ క్లారిటీ ఉంటేనే పవన్ తో సినిమాకు ఓకే అనాలి ఏ దర్శకుడైనా. లేదంటే ఏళ్లకేళ్లు ఏ సినిమా లేకుండా ఖాళీగా ఉండాల్సిందే. అప్పుడు సంపత్ నంది.. ఆ తర్వాత నీసన్.. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ మాదిరి.
పవన్ తో సినిమా అంటే ఒకప్పుడు దర్శకులు ఎగిరి గంతేసేవాళ్లు కానీ ఇప్పుడు వద్దు బాబోయ్ అంటున్నారు. ఒక్కసారి సీన్ తీసుకోండి.. అప్పుడెప్పుడో నీసన్ తో సినిమా అన్నాడు. మొదలుపెట్టాడు కూడా.. కానీ చివరికి ఏమైంది.. ఆగిపోయింది. అప్పట్లో గబ్బర్ సింగ్ 2 అంటూ సంపత్ నందిని కూడా ఇదే చేసాడు పవర్ స్టార్. ఆ తర్వాత ఏఎం రత్నం నిర్మాణంలో నీసన్ సినిమా కూడా ఇలాగే మొదలుపెట్టి ఆపేసాడు పవన్ కళ్యాణ్. ఇకిప్పుడు సంతోష్ శ్రీనివాస్ పరిస్థితి ఇంతే. హైపర్ వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఈయన మరో సినిమా మొదలుపెట్టలేదంటే కారణం పవన్ కళ్యాణ్. ఆయనతో తెరీ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడు సంతోష్. ఇప్పటికే కథలో మార్పులు కూడా చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ కు ఈ సినిమా చేయాలి. కానీ ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది. ఇది తెలియక పాపం పవన్ పై ఆశలు పెట్టుకుని ఈ దర్శకుడు ఎదురుచూపుల్లోనే జీవితం అంతా గడిపేస్తున్నాడు. మొత్తానికి చూడాలి మరి.. సంతోష్ శ్రీనివాస్ కెరీర్ ఎప్పటికీ గాడిన పడేనో..?