ఇది రంగస్థలం కాదు.. రణస్థలం అంటూ రంగస్థలంలో ఓ డైలాగ్ ఉంది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఇదే నిజమవుతుంది. ఇన్నాళ్లూ సరైన సినిమా లేక బాక్సాఫీస్ పూర్తిగా కళ తప్పింది. మళ్లీ చాలా కాలం తర్వాత ఓ సినిమా వచ్చి దుమ్ము దులిపేస్తుంది. మన తెలుగు సినిమా సత్తా ఏంటనేది ఇప్పుడిప్పుడే బాలీవుడ్ కు కూడా అర్థమవుతుంది.
బాహుబలి రికార్డులను సైతం కదిలిస్తున్నాడు సిట్టిబాబు. ఈ చిత్రం తొలిరోజు 29 కోట్ల షేర్ వస్తే.. రెండో రోజు మరో 13 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే రెండు రోజుల్లో 42 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందు కోడానికి సిద్ధమైంది. ఈ దూకుడు చూస్తుంటే తొలి వారంలోనే సినిమా 75 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
అసలు యుఎస్ లో అయితే రంగస్థలం రచ్చ మామూలుగా లేదు. అక్కడ మూడు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ అందుకుంటుంది రంగస్థలం. మూడో రోజు కూడా ఈ చిత్ర దూకుడు ఎక్కడా తగ్గలేదు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లోనే 9.15 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.
ఇక మూడో రోజు ఆదివారం కావడంతో అంతకంటే ఎక్కువే వచ్చేలా కనిపిస్తుంది. 80 కోట్లు వస్తే కానీ ఈ చిత్రం సేఫ్ కాదు. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే ఈజీగా 100 కోట్ల మార్క్ కూడా అందుకునేలా కనిపిస్తుంది ఈ చిత్రం. చూడాలిక.. రంగస్థలం చివరి వరకు ఎన్ని రికార్డులు బద్ధలుకొడుతుందో..?