చైనాలో వార్ సినిమాలు ఆడవంటారు. అంటే వాళ్లు తెరకెక్కించిన సినిమాలు ఆడతాయి కానీ పక్క దేశం నుంచి వచ్చిన వార్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు వాళ్లు. అందుకే ప్రపంచం మొత్తం గెలిచిన బాహుబలి చైనాలో మాత్రం పడుకుండిపోయాడు. పార్ట్ 2 విడుదలవుతుందంటే కూడా ఈ సినిమాపై పెద్దగా ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. ఆడితే ఓకే.. లేదంటే లైట్ అనుకునేలా ఉన్నారు దర్శక నిర్మాతలు.
కానీ ఏదో అద్భుతం జరిగింది. ఈ చిత్రం చైనాలో మంచి వసూళ్లు రాబడుతుంది. మూడు రోజుల్లో ఏకంగా 65 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. తొలిరోజు 2.8.. రెండో రోజు 2.94 మిలియన్ వసూలు చేసిన బాహుబలి 2.. మూడో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. అక్కడ మూడో రోజు 3 మిలియన్ కు చేరువగా వసూలు చేసింది ఈ చిత్రం. అంటే మూడు రోజుల్లో 65 కోట్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రం. చైనాలో ఒక్కసారి కలెక్షన్లు రావడం మొదలైతే అవి వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు బాహుబలి 2 విషయంలోనూ ఇదే జరగాలని కోరుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అక్కడ గానీ 250 కోట్లు వస్తే ఇండియాలో తొలి 2000 కోట్ల చిత్రంగా రికార్డ్ సృష్టిస్తుంది బాహుబలి 2. ఇప్పటి వరకు దంగల్ 1900 కోట్లతో ముందుంది. దీనికి చైనా బాక్సాఫీస్ బాగా కలిసొచ్చింది. అక్కడ ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పుడు బాహుబలి 2 కూడా అందుకే చైనీయులనే నమ్ముకున్నాడు.