తెలుగు ఇండస్ట్రీలో జనవరి 19 చాలా మంచి రోజు ఉన్నట్లుంది. ఒకేరోజు రెండు సినిమాలు ఓపెన్ అయ్యాయి. ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న రామ్ చరణ్, బోయపాటి సినిమా జనవరి 19నే మొదలైంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగబోతుంది. అయితే ఈ షెడ్యూల్ లో చరణ్ మాత్రం ఉండట్లేదు. వచ్చాడు.. ఓపెనింగ్ షాట్ లో ఉన్నాడు.. ముహూర్తం పెట్టగానే మళ్లీ రంగస్థలానికి వెళ్లిపోయాడు చరణ్. రాజమండ్రిలో ఈయన షూటింగ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. రంగస్థలం ఫైనల్ షెడ్యూల్ అక్కడే జరుగుతుంది. ఈ చిత్రం ఇదే నెలలో పూర్తి కానుంది. ఇది అయిపోయిన వెంటనే రాజస్థాన్ లో రెండో షెడ్యూల్ కు జాయిన్ కానున్నాడు మెగా వారసుడు. అక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శీను. ఈ షెడ్యూల్ లోనే చరణ్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు శీను బోయపాటి. ఇక ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటే నాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించబోయే సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇందులో అను ఎమ్మాన్యువల్ హీరోయిన్ గా నటిస్తుంది. శైలజారెడ్డి అల్లుడు అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అత్తగా రమ్యకృష్ణ నటిస్తుంది. అల్లరి అల్లుడు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జనవరి 19 తెలుగు ఇండస్ట్రీకి భలే మంచి రోజు అయింది. మరి ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలిక..!