కలలో కూడా అవే వస్తున్నాయి: మంచు మనోజ్

 

మరో రెండు రోజుల్లో ఒక్కడు మిగిలాడు గా మనముందుకు రాబోతున్న మంచు మ‌నోజ్ చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీ గా ఉన్నారు. ఇటీవలే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తన ఎమోషనల్ స్పీచ్ లో సంచలనాత్మక కామెంట్ లు చర్చనీయాంశమయ్యాయి. అణ‌చివేత తో తీవ్ర‌వాదం పెరుగుతుంది తప్ప తగ్గదని, ప్రేమతో నే అది సాధ్యమని చెప్తున్న మనోజ్ తన తాజా ఇంటర్వ్యూ లో చెప్పిన మరి కొన్ని విశేషాలు…

`ఒక్క‌డు మిగిలాడు` సినిమా గురించి చెప్పండి?
అందరము మనసు పెట్టి పని చేసాము. ఇది అందరి హృదయాలకు హత్తుకొనే చిత్రం అవుతుంది. 1990కి ముందు పీట‌ర్‌గానూ, 2017లో సూర్యగానూ ద్విపాత్రాభినయం చేశాను. కామెడీ గాని, పాటలు గాని చిత్రంలో ఉండవు.

అంత సీరియస్ క‌థను ఎందుకు ఒకే చేశారు?
ప్రఖ్యాత రైటర్ గోపీమోహ‌న్‌ గారు అజ‌య్ కు నన్ను సజెస్ట్ చేసి నా దగ్గరకి పంపారు. ఓ కాందిశీకులు వ‌ర్గానికి ఆరాధ్యుడైన నాయకుడి కథ ఇది. అజయ్ చేసిన రీసెర్చి అంత ఇంత కాదు. చిత్రంలో చాల వరకు కొత్తవారే నటించారు. అఫ్ కోర్స్, పోసాని గారు, సుహాసిని గారు వంటి సీనియర్ నటులు ఉన్నారు .

చిత్రంలో స్పెషల్ ఏమిటి?

ప్రథమార్ధంలో వచ్చే వార్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు దర్శకులు. ఇంటర్వెల్ తర్వాత 40 నిమిషాల పాటు నేను క‌నిపించ‌ను. సముద్రం లో బోట్ లో ట్రావెల్ చేసేప్పుడు వచ్చే కొన్ని ఉత్కంఠభరితంగా సాగే సన్నివేశాలు నాకు తెలిసి ఇంతవరకు ఇండియన్ సినిమా లోనే ఎవరు అట్టెంప్ట్ చేసి ఉండరు. ఇది మ‌న‌సును బ‌రువెక్కించే హై ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న కమర్షియల్ చిత్రమని చెప్పాలి.

సినిమా చూసిన వారు ఏమంటున్నారు ?
అక్క‌తో పాటు కొంద‌రు స్నేహితులు చూశారు. చాలా చోట్ల గూస్ బంప్స్ వచ్చాయని, హార్ట్ టచింగ్ గా ఉందని కితాబిచ్చారు.

చిత్రంకోసం మీరు తీసుకున్న శ్రద్ధ ఏమిటి?
ఎంత ఈజీగా అడిగారు(న‌వ్వుతూ). చాలా క‌ష్ట‌ప‌డ్డాను, నిద్ర లో కూడా క‌ల‌లో యుద్ధాలు చేస్తున్న ఫీలింగ్ వచ్చేది. శత్రువుల బారినుండి కుటుంబాన్ని కాపాడుకున్నట్లు వచ్చేవి ఆ కలలు.

బ‌రువు కూడా పెరిగినట్లున్నారు పాత్ర కోసం?
చాలా వెయిట్ గెయిన్ చేశాను. ఈ సినిమాలో రెండు పాత్ర‌ల మ‌ధ్య డిఫరెన్స్ చూపాలి, లేకపోతే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు. పీట‌ర్ పాత్ర కోసం బరువుగా కనిపిస్తాను. ఆ పాత్ర చేస్తున్నంత సేపు న‌రాల‌న్నీ బిగ‌బ‌ట్టి ఉండాల్సి వ‌చ్చేది. మేక‌ప్‌ కూడా ఉండ‌దు. వార్ సీక్వెన్స్ లు చేసేట‌ప్పుడు మాత్రం దెబ్బలు కనపడేలా మేకప్ చేసేవారు. ప్ర‌తి రోజూ సెట్‌కి తెల్లారుజామున 4.30కి వెళ్లేవాళ్లం. దర్శకుడు చాలా కష్టపడ్డాడు. అయన క్లారిటీ తో ఉండబట్టే చిత్రం బాగా వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడే హీరో, నేను జస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్(నవ్వుతు)

చెన్నైలో పెర‌గ‌డం వ‌ల్ల ఈ క‌థ‌కి క‌నెక్ట్ అయ్యారా?

ఆలాగని కాదు. ఎక్కడో బాంబులు వేస్తే మనకి పెద్దగా పట్టదు. అదే మన వరకు వస్తే అప్పుడు కులాలు మతాలు కూడా గుర్తుకు రావు. అటువంటిది మొత్తం సమాజం శ్రేయస్సు కోసం పోరాడిన యోధుడి స్ఫూర్తి దాయకమైన కథాకావడం చేతనే ఒప్పుకున్నా. ఇప్పటికి కొంతమంది అయితే ఆయన్ను దేవుడిలా పూజిస్తారు కూడా.

సెన్సార్ తో ప్రాబ్లెమ్ ఏమి రాలేదా?
చాలా ఇబ్బంది పెట్టారు, చుక్కలు చూపించారంటే నమ్మండి. ఇంక మీరే ఊహించుకోవచ్చు చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో. వాస్తవ సంఘటనలే అయినా మెం కేవలం ఒక్క శాతం మాత్రమే చూపించాం అంటే ఆ అరాచకాల తీవ్రత ఎలా ఉండి ఉంటుందో తలుచుకోడానికే భయం వేస్తుంది .

మీ తదుపరి చిత్రం ఎప్పుడు ప్రారంభిస్తారు?
ఇంక ఏమి అనుకోలేదండి. ఒక్కడు మిగిలాడు నుండి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది. మెంటల్ గా, ఫిజిక‌ల్‌గా సెట్ అవ్వడానికి కనీసం ఆరు నెలలు గ్యాప్ కావాలి. ఆ తర్వాత ఓ లవ్ స్టోరీ చేసే ఆలోచన ఉంది. చంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. నేను మీకు తెలుసా ద‌ర్శ‌కుడు అజ‌య్ శాస్త్రి కథను అందిస్తున్నారు.

మొన్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడారు?

కొందరు పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్స్ అన్ని వారి గ్రిప్ లో పెట్టుకున్నారు. చిన్న కొత్త డిస్ట్రిబ్యూటర్లకు అవకాశమివ్వట్లేదు. మా చిత్రాన్ని నిజంలో కొత్త డిస్ట్రిబ్యూటర్ కొన్నారు. అయన థియేటర్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆవేశ పడి ఆలా మాట్లాడాల్సి వచ్చింది. ఇండస్ట్రీ లో అందరం ఫామిలీ లాగా ఉన్నాం, కొట్లాటలు ఢాకా వెళ్తే బాగోదని నా ఫీలింగ్. పెద్దలందురు కూర్చొని చిన్న డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను అడ్రస్ చేయాలనీ కోరుకుంటున్నాను. ఒక్కడు మిగిలాడు చిత్ర కథ కూడా అణ‌చివేత‌కు –
తిరుగుబాటు అనే అంశం చుట్టూ తిరుగుతుంది.

ఇక సినిమాలు చేయను అని ఆ మ‌ధ్య ట్వీట్ చేయడానికి కారణం?
జనాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచనుంది. అది ఇప్పుడో ఎప్పుడో చెప్పలేను. అందుకే ఆలా ట్వీట్ చేశా.

రాజ‌కీయాల్లోకి వచ్చే ఆలోచనుందా?
రాజకీయాలో మరొకటో, ఏది ఏమైనా జన ల మధ్య ఉండాలి. ఇదే విషయమై విష్ణు అన్న నాకు చివాట్లు పెట్టి, బ్యాక్ మీద ఒకటి తన్ని, మర్యాద గా సినిమాలు చేసుకో, తర్వాత ఏమి చెయ్యాలో డిసైడ్ చెయ్యవచ్చు అని చెప్పాడు.

ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితి పై మీ ఒపీనియన్?
తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రభుత్వాలే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ రెండు బాగానే డెవలప్ చేస్తున్నారు. ఎటొచ్చి తమిళ్ నాడు లోనే అస్థిరత వుంది. కమల్ హాసన్ గారు సి.ఎం. అయితే బాగుంటుందనిపిస్తుంది.