ఇప్పటికే ప్రపంచంలో చాలా భాగం గెలిచేసాడు బాహుబలి. ఇక ఇప్పుడు ఈయన కన్ను చైనా దేశంపై పడింది. ఓ సారి పోరాడి ఓడినా.. మళ్ళీ ఇప్పుడు దండయాత్రకు బయల్దేరాడు. రెండోసారి మాత్రం విజయంతో తిరిగి వచ్చేలా కనిపిస్తున్నాడు. బాహుబలి 2కి చైనాలో అదిరిపోయే ఓపెనింగ్ వచ్చింది. ఈ చిత్రం తొలిరోజు అక్కడ 2.85 మిలియన్ అంటే.. అక్షరాలా 19 కోట్లు వసూలు చేసింది. భజరంగీ భాయీజాన్, దంగల్ కంటే ఎక్కువ వసూళ్లు ఇవి. తొలి రోజు ఈ చిత్రాలు బాహుబలి 2 కంటే తక్కువే వసూలు చేసాయి. 7 వేల థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. తొలిభాగం అక్కడ కేవలం 10 కోట్లు మాత్రమే వసూలు చేయగా.. ఇప్పుడు తొలిరోజే 19 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. కచ్చితంగా చైనాలో బాహుబలి 2 300 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి చైనాలో సినిమా క్లిక్ అయితే అది వసూళ్లు తెస్తూనే ఉంటుంది. దంగల్.. హిందీ మీడియం.. సీక్రేట్ సూపర్ స్టార్.. భజరంగీ భాయీజాన్ లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. మరి ఇప్పుడు బాహుబలి దండయాత్ర ఎలా ఉండబోతుందో చూడాలిక..!