రివ్యూ: అభిమ‌న్యుడు

రివ్యూ         : అభిమ‌న్యుడు
న‌టీన‌టులు   : విశాల్, స‌మంత అక్కినేని, అర్జున్, డిల్లీ గ‌ణేష్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ : జార్జ్ సి విలియ‌మ్స్
సంగీతం      : యువ‌న్ శంక‌ర్ రాజా
నిర్మాత‌       : విశాల్.. లైకా ప్రొడ‌క్ష‌న్స్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పిఎస్ మిత్ర‌న్
విశాల్ సినిమా అంటే ప్రేక్ష‌కుల‌కు ఓ ఐడియా ఉంటుంది. ఆరు పాట‌లు.. నాలుగు ఫైట్లు.. మ‌ధ్య‌లో కామెడీ.. ఇలా ఓ ఫార్మాట్ లో సాగిపోతుంది అనే అంచ‌నా అయితే ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా దాన్ని బ్రేక్ చేస్తూ వ‌స్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. అభిమ‌న్యుడుతో ఓ కొత్త క‌థ‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాడు. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అయింది..?
క‌థ‌:
క‌ర్ణాక‌ర్ (విశాల్) ఆర్మీలో సిన్సియ‌ర్ ఆఫీస‌ర్. కానీ ఆర్మీ ఆఫీస‌ర్ కు ఉండ‌కూడ‌ని కోపం అనే ల‌క్ష‌ణం ఎక్కువ‌గా ఉంటుంది. దాంతో ఓ సారి ఒక‌ర్ని కొట్టి స‌స్పెండ్ అవుతాడు. మ‌ళ్లీ క్లీన్ చీట్ కావాలంటే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్ కావాలంటారు. దానికోసం సైక్రియార్టిస్ట్ డాక్ట‌ర్ ల‌తాదేవి (స‌మంత‌) ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు క‌ర్ణ‌. కానీ తాను సంత‌కం పెట్టాలంటే త‌ను చెప్పిన‌ట్లు చేయాల‌ని కండీష‌న్ పెడుతుంది ల‌త‌.
కోపం అస్సలు తెచ్చుకోకూడ‌దు అనేది అందులో మొద‌టి కండీష‌న్. ఊరికి వెళ్లి రావాల‌నేది రెండో కండీష‌న్. ఆ టైమ్ లోనే చిన్న‌పుడే వ‌దిలేసిన కుటుంబాన్ని మ‌ళ్లీ క‌లుసుకుంటాడు క‌ర్ణ‌. చెల్లి పెళ్లి కోస‌మ‌ని బ్యాంకులో లోన్ తీసుకుంటాడు. కానీ తీసుకున్న డ‌బ్బు అలాగే అకౌంట్ లోంచి మాయం అవుతుంది. ఇలాగే వేలాది మంది డ‌బ్బును అక్ర‌మంగా త‌మ‌కే తెలియ‌కుండా దొంగిలిస్తుంటాడు వైట్ డెవిల్ అలియాస్ స‌త్య‌మూర్తి(అర్జున్). అక్క‌డ్నుంచి త‌న డ‌బ్బుతో పాటు అంద‌రి డ‌బ్బును క‌ర్ణ ఎలా తీసుకొచ్చాడు అనేది అస‌లు క‌థ‌.
క‌థ‌నం:
మ‌నం తీసుకునే బ్యాంక్ లోన్ య‌మ‌పాశం అవుతుంద‌ని తెలుసా..? ఐడెండిటి కోసం తీసుకునే ఆధార్ కార్డ్.. అవ‌స‌రం కోసం తీసుకునే అప్పు..
స‌ర‌దా కోసం తీసుకునే సెల్ఫీ.. కాల‌క్షేపం కోసం మాట్లాడే మాట‌లు.. ఇలా ఇవ‌న్నీ మ‌న‌కు తెలియ‌ని ఎవ‌డో మూడో కంటి చేతుల్లో ఉన్నాయ‌ని ఊహించుకోడానికి భ‌యంగా ఉంది క‌దా..! పెరుగుతున్న డిజిట‌ల్ యుగంలో మ‌నం బ‌తుకుతున్న స‌మాజం ఎంత ప్ర‌మాదం అంచుల్లో ఉందో చూపించిన సినిమా అభిమ‌న్యుడు. మ‌న చేతిలో వెలుగు నింపే స్మార్ట్ ఫోన్ తోనే జీవితం ఆరిపోతుంద‌ని చూపించిన స‌త్యం ఈ చిత్రం. క్ష‌ణిక లాభం కోసం ఆశ‌ప‌డి.. ఆవేశంతో మ‌నం చేసే ప‌నులు.. సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లో ప‌డి మ‌నం ఎంత‌గా మోస‌పోతున్నామో చూపించిన సినిమా అభిమ‌న్యుడు.
సాధార‌ణంగా హార్ర‌ర్ సినిమాలు చూస్తే భ‌య‌ప‌డ‌తాం.. కానీ అభిమ‌న్యుడు చూస్తుంటే అంత‌కంటే ఎక్కువ భ‌య‌మేస్తుంది. ఎందుకంటే అక్క‌డ ద‌ర్శ‌కుడు తీసింది సినిమా కాదు.. మ‌న జీవితం.. నిత్యం మ‌నకే తెలియ‌కుండా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు. ఇలాంటి క‌థ‌ను తీసుకోవ‌డం ఓ సాహ‌సం అయితే.. అర్థ‌మ‌య్యేలా తీయ‌డం మ‌రో సాహ‌సం. ఈ రెండు విష‌యాల్లోనూ ద‌ర్శ‌కుడు మిత్రన్ ప‌నితీరు అద్భుతం. డిజిట‌ల్ క్రైమ్.. సైబ‌ర్ నేరాలు.. వేలిముద్ర వేస్తే డ‌బ్బులు మాయం అవ‌డం.. ఇవ‌న్నీ సాధార‌ణంగా ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యే విష‌యాలు కావు.
కానీ క‌థ‌లో టైమ్ తీసుకుని కూడా చాలా క్లియ‌ర్ గా చూపించాడు ద‌ర్శ‌కుడు మిత్ర‌న్.
సినిమాలో వ‌చ్చే ప్ర‌తీ సీన్ మ‌న‌కు తెలియ‌కుండానే భ‌యం పుట్టిస్తుంటుంది. అరే.. నేను కూడా ఇలా మొన్న చేసానే.. బ్యాంక్ వాడికి వివ‌రాలు ఇచ్చానే.. వాడెవడో ఫోన్ చేస్తే ముందు వెన‌క చూసుకోకుండా అన్నీ చెప్పేసానే అనుకుంటాం.. మ‌నం వాడే ఫోనే మ‌న జీవితాన్ని మ‌రొక‌డి చేతుల్లో పెడుతుంద‌నే ఊహే భ‌య‌పెడుతుంది. ఫ‌స్టాఫ్ అంతా క‌థ లోకి తీసుకెళ్ల‌డానికి కాస్త టైమ్ తీసుకున్న ద‌ర్శ‌కుడు.. సెకండాఫ్ లో హీరో, విల‌న్ మ‌ధ్య మైండ్ గేమ్ తో అల‌రించాడు.
ముఖ్యంగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు సినిమాకు ప్రాణం. చివ‌ర‌గా అభిమ‌న్యుడు సందేశం ఇవ్వ‌లేదు.. ఓ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వున్న‌ది డిజిట‌ల్ యుగంలో.. వేక్ అప్ అండ్ బీ అల‌ర్ట్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
న‌టీన‌టులు:
ఆర్మీ ఆఫీస‌ర్ గా విశాల్ చాలా బాగా న‌టించాడు. ఈయ‌న‌లోని న‌టుడు రోజురోజుకీ మెరుగ‌వుతున్నాడు. ముఖ్యంగా క‌థ‌ల విష‌యంలో ఈయ‌న చూపిస్తున్న ఆస‌క్తే విశాల్ ను మ‌రో స్థాయికి చేరుస్తుంది. ఆర్మీ ఆఫీస‌ర్ గా ఎంత రూడ్ గా ఉన్నాడో.. డిజిట‌ల్ క్రైమ్ ను చేధించే క్ర‌మంలో అంతే ప‌క్కా ఆర్మీ మ్యాన్ గా అనిపించాడు. ఇక యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి ప్రాణం. ఇతడి పాత్ర కాస్త ఆల‌స్యంగా క‌థ‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇచ్చిన త‌ర్వాత ఇంకెవ‌రూ క‌నిపించ‌లేదు. క్లైమాక్స్ వ‌ర‌కు ఆయ‌నదే రాజ్యం. స‌మంత బాగా చేసింది. డాక్ట‌ర్ గా మెప్పించింది. హీరో తండ్రిగా ఢిల్లీ గ‌ణేష్ ప‌ర్లేదు. మిగిలిన వాళ్ళంతా క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి వెళ్లే పాత్ర‌లే.
టెక్నిక‌ల్ టీం:
ఈ చిత్రానికి నూటికి నూరు మార్కులు సంపాదించింది యువ‌న్ శంక‌ర్ రాజా. ఈయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. రెండున్న‌ర గంట‌ల కంటే ఎక్కువగానే ఉన్నా ఎక్క‌డా బోర్ అనిపించ‌దు. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఇక ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ గురించి చెప్పాలి.. ఈయ‌న తీసుకున్న క‌థ‌పై చేసిన స్ట‌డీ ఏంటో సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది. ప్ర‌తీ సీన్ ను ప‌క్కాగా రాసుకున్నాడు. ఎక్క‌డా చిన్న డౌట్ కూడా రానివ్వ‌లేదు ప్రేక్ష‌కుల బుర్ర‌ల్లో. అయితే పాట‌లు అసంద‌ర్భంగా రావ‌డం.. అన‌వ‌స‌ర‌పు కామెడీకి ట్రై చేయ‌డం ఒక్క‌టే సినిమాకు కాస్త మైన‌స్.
చివ‌ర‌గా:
డిజిట‌ల్ మాయాజాలాన్ని చీల్చిన అభిమ‌న్యుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here