రజినీకాంత్ కు రాజకీయ అనుభవం లేదని అంతా హేళన చేస్తున్నారు. ఆయనకేం అర్హత ఉంది.. అసలు తమిళుడే కాదని భారతీరాజా లాంటి పెద్ద దర్శకులు కూడా విమర్శించారు. ఇక రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని చాలా మంది అంటున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా హాయిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు పార్టీ స్థాపించలేదు..
ఎన్నికలకు సిద్ధం కావడం లేదు కానీ రజినీ ప్రభావం మాత్రం తమిళనాడులో భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈయన పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై ఈ మధ్యే ఓ సర్వే నిర్వహించారు. ఇందులో అందరికీ కళ్లుబైర్లు గమ్మే విషయాలు బయటికి వచ్చాయి. ఒకట్రెండు కాదు.. ఏకంగా రాష్ట్రంలోని 234 నియోజక వర్గాల్లో 150 సీట్లు రజినీకాంత్ కు అనుకూలంగా ఉన్నాయని తెలుసుకుని ప్రతిపక్ష..
అధికార పక్ష ప్రతినిథులకు ఒంట్లో నెత్తుటి చుక్క లేకుండా పోతుంది. ఈ నియోజక వర్గాల్లో రజనీకాంత్ కి 35 నుంచి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని తేలింది. అక్కడితో ఆగలేదు.. దళితులు 15 శాతం.. మైనారిటీలు 8 శాతం.. ఇతర సామాజిక వర్గాలు వారంతా మరో 15 శాతం రజినీకాంత్ కు అండగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.
ఇప్పుడు ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నా.. తన వ్యూహం మాత్రం ఇప్పటికే రజినీ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఓ వైపు తన పార్టీని బలోపేతం చేయడానికి ముందు నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. ఈ క్రమంలోనే తన పార్టీ లీడర్స్ అందరినీ పిలిచి రహస్య మీటింగ్ లు కూడా పెడుతున్నాడు రజినీ. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినా కూడా ఇప్పటివరకు ఏ పార్టీని కానీ..
లీడర్ ను కానీ విమర్శించడం చేయలేదు రజినీ. తాను ఎంజీఆర్ లా పాలన అందిస్తానని చెప్పి అన్నాడీఎంకే కార్యకర్తలను ప్రసన్నం చేసుకున్నారు. ఇక కరుణానిధిని కూడా ఏం అనట్లేదు సూపర్ స్టార్. ఈ లెక్కన డిఎంకేతో కూడా రజినీ స్నేహంగానే ఉంటున్నారు. ఇలా తమిళనాడులో రెండు పార్టీలతో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు రజినీకాంత్. ఇలాంటి టైమ్ లో కానీ ఎన్నికలు వస్తే ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విమర్శించే గుణం లేకపోతే రాజకీయాల్లో పైకి రావడం సాధ్యం కాదు. అది లేకే చిరంజీవి దారుణంగా వెనకబడిపోయాడు. మరి ఇప్పుడు రజినీ ఏం చేస్తాడో..?