అదేంటి.. సావిత్రిని చంపేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఎప్పుడో మూడున్నర దశాబ్ధాల కింద చనిపోయిన నటి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండింగ్ అయిపోయింది. మహానటి విడుదలవుతున్న తరుణంలో ఈ చిత్రం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందర్లోనూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈమె చివరిరోజుల్ని దర్శకుడు ఎలా చూపించి ఉంటాడు అనేది అందరికీ ఆసక్తికరమే. ఎందుకంటే సావిత్రి జీవితంలో చివరిరోజులు మరీ దుర్భరంగా గడిచాయి.
ఆమె కనీసం ఉండటానికి ఇళ్లు కూడా లేని విధంగా.. ఏడాదిన్నరకు పైగా కోమాలో ఉండి తనువు చాలించింది. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగిన సావిత్రి.. చివరిరోజుల్లో మాత్రం చాలా దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఆమె పరిస్థితి చూసి అయ్యోపాపం అంటూ అంతా కన్నీరు పెట్టుకున్న వాళ్లే. అప్పట్లో ఆమె జీవితానికి ప్రతినాయకుడు ఆమె భర్త జెమినీ గణేషనే. ప్రతీఒక్కరూ అప్పట్లో జెమినిని విమర్శించిన వాళ్లే.
ఇప్పుడు ఇవన్నీ సినిమాలో నాగ్ అశ్విన్ ఎలా చూపించి ఉంటాడో అనేది ఆసక్తికరంగా మారింది. అయితే క్లైమాక్స్ లో మాత్రం సావిత్రి చావును మాత్రం చూపించట్లేదని తెలుస్తుంది. ఇదే జరిగితే సావిత్రి జీవితాన్ని.. మహానటి సినిమాను నాగ్ అశ్విన్ ఎలా ముగించి ఉంటాడో అనేది తెరపైనే చూడాలిక..! ఒకవేళ సావిత్రి బతికితే.. అందులో వాస్తవికతకు దూరంగా ఉంటే మాత్రం ప్రేక్షకుల నుంచి.. నాటి విశ్లేషకుల నుంచి విమర్శలు తప్పవు. మరి చూడాలిక.. వీటన్నింటనీ ఈ కుర్ర దర్శకుడు ఎలా హ్యాండిల్ చేసి ఉంటాడో..?