పదేళ్లైంది ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసాడు.. కానీ కనీసం హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అసలే హిట్స్ లేవంటే.. ఏ రెండేళ్లకో మూడేళ్లకో ఒక్కసారి వస్తాడు. అతడే సుశాంత్.. కేరాఫ్ అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున అక్క కొడుకు ఈ కుర్రాడు. పదేళ్ల కింద కాళిదాసు సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత కరెంట్ అన్నాడు.. అది పాస్ అవ్వలేదు. అడ్డా అన్నాడు..
అదెక్కడో అడ్రస్ తేలలేదు. ఇక రెండేళ్ల కింద ఆటాడుకుందాం రా అంటూ పిలిచాడు. దాని జాడే కనిపించలేదు. ఇప్పుడు చిలసౌ అంటున్నాడు. ఈ సారి కాస్త కొత్తగా ట్రై చేసినట్లు కనిపిస్తున్నాడు ఈ కుర్రాడు. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం విశేషం. ఇన్నాళ్ళూ నటుడిగా అలరించిన రాహుల్.. ఇప్పుడు దర్శకుడిగా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. తాజాగా విడుదలైన చిలసౌ టీజర్ ఆకట్టుకుంది. పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తోనే ఆసక్తి పుట్టించింది.
నిజానికి ఇప్పటి వరకు సుశాంత్ సినిమాపై కానీ.. రాహుల్ దర్శకత్వంపై కానీ పెద్దగా నమ్మకాలు అయితే లేవు. కానీ ఇప్పుడు టీజర్ చూసాక మాత్రం కచ్చితంగా లైట్ తీసుకోవడానికి లేదు. ఈ ఇద్దరూ కలిసి ఏదో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నట్లే అనిపిస్తుంది. మరి చూడాలిక.. ఈ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అయినా సుశాంత్ కు కోరుకున్న విజయం తీసుకొస్తుందో రాదో..?