​మార్చి 23న `ఆనందం`

ప్ర‌తి క్ష‌ణాన్ని ఆనందంగా గ‌డ‌పాల‌ని ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల్లోనూ ఉంటుంది. జీవితంలో మిగిలిన రోజుల సంగ‌తి ఎలా ఉన్నా.. కాలేజీలో, క్యాంప‌స్‌లో స‌ర‌దాగా గ‌డిపే క్ష‌ణాలు  మాత్రం ఆనందానికి కేరాఫ్ అడ్ర‌స్‌లు.  ఓ వైపు చ‌దువు అనే బాధ్య‌త ఉన్నా… భ‌విష్య‌త్తు గురించి ఆలోచ‌న‌లు వెంటాడుతున్నా… చుట్టూ స్నేహితులు, అంద‌మైన క‌ల‌లు ఆనందాల లోకంలో విహ‌రింప‌జేస్తాయి.
అలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కాలేజ్ డేస్‌లో ఆస్వాదించిన ఆనందాన్ని మ‌ర‌లా ఓ సారి తెర‌మీద చూపించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు సుఖీభ‌వ మూవీస్ అధినేత ఎత్త‌రి గురురాజ్‌.  మ‌ల‌యాళంలో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన `ఆనందం` చిత్రాన్ని అదే పేరుతో ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ నెల 23న అందించ‌నున్నారు. మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఈ చిత్రానికి  గ‌ణేశ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేర‌ళ టాప్ హీరో `ప్రేమ‌మ్` ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన న‌టీన‌టులంద‌రూ దాదాపుగా కొత్త‌వారే. తెలుగులో అనువాద‌మ‌వుతోన్న `ఆనందం` చిత్రానికి వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి  సహ నిర్మాతలు . సీనియర్ నిర్మాత ఆర్‌. సీతారామ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. 
`ఆనందం` గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ “మా `ఆనందం` అనువాద‌ ప‌నులు దాదాపుగా పూర్త‌య్యాయి.  తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ నెల 17న పాట‌ల వేడుక‌ను గ్రాండ్‌గా నిర్వ‌హిస్తాం. కేర‌ళ‌లో టాప్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ల‌లో ఒక‌రైన స‌చిన్ వారియ‌ర్ స్వ‌రాల‌కు వ‌న‌మాలి అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. `హ్యాపీడేస్‌` పాట‌ల త‌ర‌హాలోనే మా పాట‌లు కూడా త‌ప్ప‌కుండా చార్ట్ బ‌స్ట‌ర్ అవుతాయి. యువ‌త చెవుల్లో మారుమోగుతాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను.  ఈ నెల 23న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. కేర‌ళ‌లో నిర్మాత‌లు పెట్టిన ఖ‌ర్చుకు ఐదింత‌లు మొత్తాన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాబ‌ట్ట‌గ‌లిగిందంటేనే ఈ క‌థ‌కున్న ప‌వ‌ర్‌ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగులోనూ అందుకు ధీటుగా ఆడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ప‌లువురు ఈ సినిమాను రీమేక్ చేస్తామ‌ని, రైట్స్ ఇవ్వ‌మ‌ని అడిగిన‌ప్ప‌టికీ ఆ  న‌మ్మ‌కంతోనే మేం అనువాదం చేస్తున్నాం. ఎక్క‌డా మ‌ల‌యాళ సినిమా అని అనిపించ‌దు. కాలేజీ అనుభ‌వాలు అనేవి ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఒకే ర‌కంగా ఉంటాయి. మ‌న‌సు పొర‌ల్లో ప‌దిలంగా జ్ఞాప‌కాలుగా మిగిలి ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ  చ‌దువుకున్న‌ రోజులు గుర్తుకొస్తాయి. ఒక ఇండ‌స్ట్రియ‌ల్ టూర్ నాలుగు రోజులు జ‌రిగితే అక్క‌డ  మూడు ప్రేమ జంట‌ల క‌థే మా సినిమా. త‌ప్ప‌కుండా ప్ర‌తి గుండెనూ త‌డుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అని అన్నారు. 
 
తారాగ‌ణం:
అరుణ్ కురియ‌న్‌, థామ‌స్ మాథ్యూ, రోష‌న్ మాథ్యూ, విశాక్ నాయ‌ర్‌, సిద్ధి మ‌హాజ‌న‌క‌ట్టి, అన్ను ఆంటోని, అనార్క‌ళి మ‌రిక‌ర్‌, నివిన్ పాల్‌, రెంజి ఫ‌ణిక్క‌ర్ త‌దిత‌రులు 
సాంకేతిక నిపుణులు:
మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర రెడ్డి, పాట‌లు: వ‌న‌మాలి, సంగీతం: స‌చిన్ వారియ‌ర్‌, కెమెరా: ఆనంద్‌. ఇ. చంద్ర‌న్‌, సహ నిర్మాతలు : వీరా  వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి , ద‌ర్శ‌క‌త్వం: గ‌ణేశ్ రాజ్‌, స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌. సీతారామ‌రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here