ఇంకా 8 కోట్లే.. ఎనిమిదంటే ఎనిమిది కోట్లు వస్తే చాలు 100 కోట్ల మైలురాయి అందుకున్న రెండో తెలుగు సినిమాగా చరిత్ర సృష్టిస్తాడు రామ్ చరణ్. దీనికంటే ముందు ఖైదీ నెంబర్ 150 మాత్రమే ఈ లిస్ట్ లో ఉంది. ఇక్కడ బాహుబలి సపరేట్. అది తెలుగు సినిమా కాదు. ఇంటర్నేషనల్ సినిమా బాహుబలి. ఆ రేంజ్ అలాంటిది. అందుకే నాన్ బాహుబలి అంటూ తెలుగులో మరో రికార్డుల వేట మొదలైంది. అందులో చిరంజీవి అందరి కంటే ముందున్నాడు. పదేళ్ల తర్వాత వచ్చినా కూడా పదేళ్లుగా ఎవరూ చేయలేని రికార్డు చేసి చూపించాడు చిరు. ఖైదీ నెం.150తో వచ్చీ రావడంతోనే 100 కోట్ల మైలురాయి అందుకున్నాడు. ఆ తర్వాత పవన్.. మహేశ్.. ఎన్టీఆర్ లాంటి హీరోలు వచ్చినా ఖైదీ నెం.150 రికార్డులు మాత్రం అందుకోలేదు.
ఇప్పుడు ఆ అవకాశం మళ్లీ తనయుడికే వచ్చింది. ఈయన రంగస్థలం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 92 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా 3.1 మిలియన్ అందుకుని నాన్ బాహుబలి రికార్డులకు తెరతీసింది రంగస్థలం. ఈ దూకుడు చూస్తుంటే 3.3-3.5 మిలియన్ మధ్యలో రంగస్థలం ప్రయాణం ఆగేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఇది సృష్టించిన రికార్డులు భరత్ అనే నేనుకు సవాల్ గా మారాయి. ఇప్పుడు కచ్చితంగా మహేశ్ తన స్టామినా నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు ఓవర్సీస్ లో మార్కెట్ లేని చరణ్.. ఇప్పుడు ఒకే సినిమాతో నాన్ బాహుబలి రికార్డులన్నీ తన పేర రాసుకున్నాడు. మరి చూడాలి.. చివరి వరకు సిట్టిబాబు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో..? ఇప్పటికే ఈ చిత్రం ఖాతాలో 92 కోట్ల షేర్ వచ్చి చేరింది. మరి చూడాలిక.. రాబోయే రోజుల్లో 100 కోట్లు రంగస్థలం ఖాతాలో పడతాయో లేదో..?