చేతిలో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నపుడు ఎదురుగా ఎవరున్నారు.. వెనకాల ఎవరొస్తున్నారు.. ముందు ఎవరుంటారు.. పోటీలో ఎవరితో తలబడాలి.. ఇవన్నీ గుర్తుండవు. మనం దూకామా.. యుద్ధంలో గెలిచామా అనేది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మహానటి టీంలో ఈ ధైర్యం, తెగింపు కనిపిస్తు న్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 29న విడుదల కానుంది. అయితే అప్పుడు రంగస్థలం కూడా విడుదల కానుంది. కానీ మహానటి యూనిట్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. అన్నీ నిర్ణయించుకునే బరిలో దిగినట్లు కనిపిస్తుంది వాళ్ల చూస్తుంటే. పైగా సావిత్రి జీవితం ఆధారంగా మహా నటి తెరకెక్కుతోంది. సావిత్రి జీవితం అంటే కొందరి సొత్తు కాదు.. అది అందరు తెలుగు వాళ్ల హక్కు. ఈమె జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్న విషయంలో తెలుసుకోడానికి ప్రతీ తెలుగువాడు ఆసక్తి చూపిస్తూనే ఉంటాడు. మొన్న విడుదలైన మోషన్ పోస్టర్ లోనే కావాల్సినంత కొత్త దనం చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
మాయాబజార్ లో ఉండే మ్యాజిక్ మిర్రర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా చూసిన వాళ్లెవ్వరికైనా దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు మోషన్ పోస్టర్ కోసం కూడా ఇదే వాడుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మాయాబజార్ సెట్ లోకి సావిత్రి పాత్రధారి అయిన కీర్తిసురేష్ వచ్చి.. బాక్సు తెరవగానే అందులోంచి సావిత్రి స్వరంతో కూడిన కొన్ని డైలాగులు.. పాటలు వస్తాయి. తర్వాత కొన్ని కథలు చరిత్రే.. వాటికి అంతం ఉండదంటూ రాసుంటుంది. వెంటనే మహానటి అంటూ టైటిల్ వస్తుంది. ఇదంతా చూస్తుంటే సినిమా ఎంత విజువల్ వండర్ గా ఉండబోతుందో అర్థమైపోతుంది. చిన్న మోషన్ పోస్టర్ కే ఇంతగా ఆసక్తి రేకెత్తిస్తే.. రేపు సినిమా విషయంలో నాగ్ అశ్విన్ ఇంకెంత జాగ్రత్త తీసుకుని ఉంటాడో మరి..! మొత్తానికి తాము యుద్ధానికి సిద్ధం అని ముందుగానే వార్ డిక్లేర్ చేసారు మహానటి టీం. తర్వాత అది ఎలా ఉండబోతుందో చూడాలిక..!