మరో శుక్రవారం వచ్చేసింది.. మళ్ళీ కొత్త సినిమాలు వచ్చేసాయి. దాంతో పాత సినిమాలు పాతబడిపోయినట్లే..! కానీ వాటి పరిస్థితేంటి..? గత కొన్ని వారాల్లో మొన్నొచ్చినవి చిన్న సినిమాలు కాదు.. క్రేజీ సినిమాలు. నాని.. అఖిల్.. సల్మాన్ లాంటి హీరోలు నటించినవి. మరి వాటి పరిస్థితేంటో తెలుసుకోవాలి కదా..! తొలివారంలో ఆ సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేసాయో ఇప్పుడు లెక్కలొచ్చేసాయి. ఏ సినిమా జాతకమేంటో తెలిసిపోయింది. ముందుగా తెలుగు సినిమాల సంగతే తీసుకుందాం..! మిడిల్ క్లాస్ అబ్బాయితో వరసగా ఎనిమిదో విజయాన్ని అందుకున్నాడు. ఎంసిఏ తొలి రోజు 9.55 కోట్ల షేర్ వసూలు చేసింది. యావరేజ్ టాక్ తోనే ఓపెన్ అయినా కూడా నానిపై ఉన్న నమ్మకమో ఏమో కానీ భారీ వసూళ్లు తీసుకొచ్చింది. దానికితోడు రెండోరోజు అఖిల్ హలో వచ్చినా కూడా ఎక్కడా ఎంసిఏ వసూళ్లు మాత్రం తగ్గలేదు. ఈ చిత్రం తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా 29.59 కోట్లు వసూలు చేసింది.
ఇక హలో తొలి వారం కేవలం 13 కోట్లతో సరిపెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆరు రోజుల్లో కేవలం 10.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది అఖిల్ సినిమా. టాక్ బాగానే ఉన్నా.. మాస్ ప్రేక్షకులకు సినిమా రీచ్ కాలేదు. పైగా మనసంతా నువ్వే ఫ్లేవర్ ఉండటం కూడా మైనస్ గా మారింది ఈ చిత్రానికి. అన్నింటికి తోడు ఎంసిఏ మార్కెట్ లో దున్నేసాడు. దాంతో అఖిల్ కు ఛాన్స్ లేకుండా పోయింది. అయితే అఖిల్ కోరుకున్న విజయం రాకపోయినా.. నటుడిగా గుర్తింపు మాత్రం వచ్చింది. ఇదే ఆనందపడుతున్నాడు సిసింద్రీ కూడా.
ఇక టైగర్ జిందా హై బాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాస్తున్నాడు. ఈ చిత్రం తొలిరోజు 34 కోట్లు వసూలు చేసినా.. రెండో రోజు నుంచి రచ్చ మొదలుపెట్టాడు. వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది టైగర్. బాలీవుడ్ లో ఇప్పటి వరకు బాహుబలి 2 పేరు మీదున్న రికార్డులను దాటలేకపోయినా కూడా టైగర్ జిందా హై రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తానికి ఈ మూడు సినిమాలు ఎవరికి వాళ్లకి బాగానే కలిసొచ్చాయి.