ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలంతా ల్యాండ్ మార్క్ సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు. టైమ్ కూడా అదే నడుస్తుంది. హీరోలంతా ఒక్కొక్కరుగా తమ మైల్ స్టోన్ మూవీస్ ను అందుకుంటున్నారు. గతేడాది నుంచి ఈ రచ్చ మరీ ఎక్కువైపోయింది. ఆ మధ్య చిరంజీవి 150వ సినిమా చేస్తే.. బాలయ్య 100 సినిమాల మైలురాయి అందుకున్నాడు. శర్వానంద్ కూడా శతమానం భవతితో 25 సినిమాల మైల్ స్టోన్ టచ్ చేసాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ 25.. ఇప్పుడు పవన్ నిర్మాతగా చేస్తోన్న సినిమాతో నితిన్ 25 సినిమాలు పూర్తైపోయాయి. ఇక ఇప్పుడు పవన్ కూడా 25వ సినిమా మైలురాయి అందుకుంటున్నాడు. త్రివిక్రమ్ తో చేసిన అజ్ఞాతవాసి ఈయనకు 25వ సినిమా.
ఇక ఇప్పుడు మరో హీరో కూడా ల్యాండ్ మార్క్ అందుకుంటున్నాడు.. ఆయనే గోపీచంద్. 2001లో తొలివలపు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు గోపీచంద్. ఆ సినిమా ప్లాపైనా.. రెండేళ్ల తర్వాత జయం సినిమాలో విలన్ గా రప్ఫాడించాడు. వర్షం, తమిళ జయం, నిజం సినిమాల్లో విలన్ గా నటించిన తర్వాత యజ్ఞంతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. రణం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం లాంటి విజయాలతో హీరోగా నిలబడ్డాడు. ఇక ఇప్పుడు 25వ సినిమా చేస్తున్నాడు. చక్రి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రవితేజ చేయాల్సిన సినిమా కానీ ఆయన నో చెప్పడంతో గోపీ ఓకే అన్నాడు.
ఈ చిత్ర ఓపెనింగ్ కూడా జరిగింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. జనవరి 5న హైదరాబాద్ లోనే రెండో షెడ్యూల్ మొదలైంది. ఇక్కడే ఓ స్టార్ హోటల్లో షూటింగ్ జరుగుతుంది. మెహ్రీన్ కౌర్ హీరోయిన్. ఈ మధ్య వరస పరాజయాలు గోపీచంద్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సౌఖ్యం, జిల్ తో పాటు ఈ మధ్యే వచ్చిన గౌతమ్ నందా, ఆక్సీజన్ కూడా గోపీచంద్ కు నిరాశనే మిగిల్చాయి. ఆరడుగుల బుల్లెట్ ఎప్పుడొస్తుందో తెలీదు. ఇప్పుడు చక్రి సినిమా కూడా కమిటయ్యాడు. మొత్తానికి రవితేజ కథతో గోపీచంద్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.. తన 25వ సినిమాతో విజయం అందుకుంటాడో లేదో చూడాలిక..!