ఇండస్ట్రీ అంటేనే వైకుంఠపాళి ఆట. ఇక్కడ నిచ్చెనలు అనే హిట్లు ఎక్కుకుంటూ లక్ష్యం చేరువవ్వాలి. అంతేకానీ ఫ్లాపులు అనే పాముల నోట్లో పడితే ఎక్కిన మెట్లు కూడా దిగాల్సి వస్తుంది. ఇప్పుడు సాయిధరంతేజ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే వరసగా నిచ్చెనలు ఎక్కి టాప్ లెవల్ కు చేరుకున్నాడు. కానీ తిక్క అనే పెద్ద పాము సాయిని మింగేసింది. ఆ తర్వాత నిచ్చెనలు రావడం మానేసాయి. వరసగా విన్నర్ అనే మరో పాము కాటేసింది. దాని దెబ్బ నుంచి కోలుకోక ముందే నక్షత్రం రూపంలో అనకొండ వచ్చి మింగేసింది. అయ్యోరామా అనుకుంటున్న టైమ్ లో మందు రాస్తుందేమో అనుకున్న జవాన్ అనే మరో పాము వెనక నుంచి వచ్చి కాటేసింది. ఇన్ని కాట్లు పడిన తర్వాత కూడా ఇంకా నిచ్చెన వస్తుందనే ఆశతోనే ఉన్నాడు సాయిధరంతేజ్. అలాంటి టైమ్ లో వచ్చిన సినిమా ఇంటిలిజెంట్. ఇది తనకు నిచ్చెన అవుతుంది.. దెబ్బకు టాప్ కి వెళ్లిపోదాం అనుకున్నాడు మెగా మేనల్లుడు. కానీ తన కెరీర్ ను పూర్తిగా మింగేయడానికి వచ్చిన అతిపెద్ద పురాతన అనకొండ ఇదే అని గ్రహించ లేకేపోయాడు మెగా మేనల్లుడు. ఈ కాటు దెబ్బకు సాయి ఇప్పట్లో లేచేలా కూడా కనిపించట్లేదు. అంత దారుణమైన కాటు పడింది. ఇప్పుడు ఏదో ఓ నిచ్చెన ఎక్కాలి.. లేదంటే మరింత దిగజారడం ఖాయం. ఇప్పటికైనా దర్శకుల బ్రాండ్ కాదని.. కథను నమ్ముకుంటే మంచిదేమో..? ఇన్నాళ్లూ వినాయక్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న సాయికి ఇప్పుడు అది కోలుకోలేని దెబ్బ కొట్టింది. మరి చూడాలిక.. కనీసం కరుణాకరణ్ సినిమాతోనైనా సాయి హిట్ కొడతాడో లేదో..?