100 కోట్లు.. వంద కోట్లంటే మాటలు కాదు. ఆటలు కూడా కాదు. ఎంత కష్టపడితే వస్తాయి వంద కోట్లు. కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలకు మాత్రం వంద కోట్లు అంటే ఆటలే.. ఆడుతూ పాడుతూ మా సినిమా 100 కోట్ల బిజినెస్ చేసిందని చెప్పుకుంటున్నారు. అసలు మూడేళ్ళ కింద మన తెలుగు ఇండస్ట్రీకి 100 కోట్ల బిజినెస్ అనేది కల. అసలు ఆ వైపుగా బాలీవుడ్ తప్ప మరే ఇండస్ట్రీ కనీసం అటువైపు చూడదని అందరి అంచనా. 100 కోట్లు రావాలంటే దేశమంతా మార్కెట్ ఉండాలి అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. 100 కోట్లు అనేది తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ ఇండస్ట్రీకి కూడా వచ్చేసింది. కనీసం 100 కోట్లు లేకపోతే మన హీరోలకు అసలు ఆనట్లేదు. ఎలాగైనా తమ సినిమాకు 100 కోట్లు వచ్చాయని చెప్పుకోవాలంతే. ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా కనీసం 75 కోట్లు వసూలు చేస్తే గానీ హిట్ అనిపించుకోలేదు.
ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అలా జరుగుతుంది మరి. ఇప్పుడు ఆ రేంజ్ కూడా మారిపోతుంది. జై లవకుశ.. డిజే లాంటి సినిమాలకు 70 కోట్ల కంటే ఎక్కువగానే వచ్చినా కూడా అబౌ యావరేజ్ అనిపించుకున్నాయి. దానికి కారణం జరిగిన బిజినెస్. ఇప్పుడు అజ్ఞాతవాసి బిజినెస్ అయితే ఏకంగా 120 కోట్లు చేసారు. ఫలితం దారుణంగా మునగడమే. ఈ సినిమా కనీసం 60 కోట్లు వసూలు చేయలేక చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇదే కాదు స్పైడర్ బిజినెస్ కూడా అలాగే చేసి ముంచేసారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత పెద్ద డిజాస్టర్ గా చరిత్రలోకి ఎక్కేసింది. ఇవే కాదు.. రాబోయే సినిమాల బిజినెస్ లు కూడా అంతే ఉన్నాయి.
మహేశ్ భరత్ అనే నేను బిజినెస్ 100 కోట్లకు చేరువగా వస్తుంది. ఈయన గత సినిమాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ డిజాస్టర్లు. అయినా కానీ అంతే బిజినెస్ చేస్తున్నారు మళ్లీ. ఇక రంగస్థలం బిజినెస్ 70 కోట్ల వరకు జరుగుతుంది. నా పేరు సూర్య కూడా 80 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్నారు. ఇంతింత బిజినెస్ చేయడం వల్ల ఒకవేళ నిజంగా సినిమా బాగున్నా కూడా అన్ని కోట్లు రాబట్టలేకపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 12 కోట్ల మందిలో సినిమా చూసే వాళ్లు 15 శాతం కూడా ఉండరు. అంటే ఎంతమంది ఎన్నిసార్లు చూస్తే ఓ సినిమాకు 100 కోట్లు వస్తాయి.. ఈ చిన్న లాజిక్ కూడా మరిచిపోతున్నారు మన నిర్మాతలు. ఇకపై 100 కోట్లు అంటూ చంకలు గుద్దుకుంటే మళ్లీ మన బిజినెస్ స్థాయి 60-70 కోట్లకు పడిపోవడం ఖాయం. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగుతుందన్నట్లుంది ఇప్పుడు మన హీరోల పరిస్థితి చూస్తుంటే..!