ఈ రోజుల్లో సినిమా రన్ టైమ్ అంటే రెండు గంటల 20 నిమిషాలు.. మరీ లెంతీ అంటే రెండున్నర గంటలు. ఓ సినిమాకు ఐడియల్ రన్ టైమ్ అంటే రెండున్నర గంటలే. కానీ ఇప్పుడు అంత కూడా ఎవరూ చేయడం లేదు. వీలైనంత వరకు రెండున్నర గంటల కంటే తక్కువే ఉండేలా చూస్తున్నారు.
కానీ కొందరు దర్శకులు మాత్రం రెండున్నర గంటల్లో తమ సినిమాను చూపించలేకపోతున్నారు. అందులో సుకుమార్ కూడా ఉంటాడు. ఇప్పుడు ఈయన తెరకెక్కిస్తోన్న రంగస్థలం నిడివి కూడా రెండున్నర గంటల కంటే ఎక్కువే ఉంది.
ఏకంగా రెండు గంటల 50 నిమిషాలతో రానుంది ఈ చిత్రం. ఇది కాస్త ఎక్కువే అని తెలుసు.. కానీ తాను చెప్పాలనుకున్న కథను ఇంతకంటే తక్కువ టైమ్ లో చెప్పలేనంటున్నాడు సుకుమారుడు. అందుకే కాస్త ఎక్కువైనా పర్లేదని దాదాపు మూడు గంటల సినిమాను తీసుకొస్తున్నాడు. అయినా ఎమోషన్స్ కనెక్ట్ అయితే.. మూడు కాదు మూడున్నర గంటలున్నా కూడా ప్రేక్షకులు చూస్తారని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. గతేడాది విడుదలైన అర్జున్ రెడ్డి నిడివి మూడు గంటల పైనే. ఆ నమ్మకంతోనే ఇప్పుడు భారీ నిడివితో వస్తుంది రంగస్థలం.
మార్చ్ 30న ఈ చిత్రం విడుదల కానుంది. మరి చూడాలిక.. రంగస్థలంతో రామ్ చరణ్ రచ్చ ఎలా ఉండబోతుందో..?