పదేళ్లైంది ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పటి వరకు 10 సినిమాలు చేసాడు.. చాలా సాధించాడు కూడా.. ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాడు. కానీ రామ్ చరణ్ కు ఇప్పటికీ ఏదో కావాలి. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాసిన చరిత్ర మెగా వారసుడి సొంతం.
ఇది తొమ్మిదేళ్ల కింద జరిగింది. కానీ ఇప్పటికీ అక్కడే ఉండిపోయాడు అదే ఇప్పుడు అసలు సమస్య. మగధీరతో పెరిగిన మార్కెట్ ఇప్పటికీ అక్కడే ఆగిపోయింది. 2009లోనే 70 కోట్ల మార్క్ అందుకున్న చరణ్.. ఇప్పటి వరకు మళ్లీ అలాంటి బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయాడు. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ స్థాయి విజయం మాత్రం ఇప్పటి వరకు రాలేదు.
అంతెందుకు మగధీర తర్వాత మరో 50 కోట్ల సినిమా కోసం ఏడేళ్లు ఆగాడు చరణ్. ధృవతో అది సాధించాడు. దీనికి ముందు ఎవడు.. నాయక్.. రచ్చ.. లాంటి సినిమాలు విజయం సాధించాయి కానీ 50 కోట్లు మాత్రం సాధించలేదు. ఈయన కంటే తక్కువ ఇమేజ్ ఉంది అనుకున్న హీరోలంతా ఇప్పుడు 70..80..90 కోట్లు కూడా సాధిస్తున్నారు.
అల్లుఅర్జున్ నే తీసుకోండి.. ఈయన మార్కెట్ ఇప్పుడు 70 కోట్లు. టాప్ గ్రేడ్ లో ఉంటూ 50 కోట్లలోనే ఆగి పోయిన ఏకైక హీరో రామ్ చరణ్. అదే ఇప్పుడు చరణ్ లో ఉన్న బాధ. అందుకే రంగస్థలంతో 70 కోట్ల మార్క్ అందుకుని.. తాను కూడా టాప్ గ్రేడ్ హీరోనే అని నిరూపించుకోడానికి చూస్తున్నాడు మెగా వారసుడు. ఈ చిత్రం తర్వాత ఎలాగూ బోయపాటి.. రాజమౌళి.. కొరటాల సినిమాలున్నాయి కాబట్టి చరణ్ కు తిరుగుండదు. అవి కానీ హిట్టైతే మనోడి మార్కెట్ 70 ఏం ఖర్మ.. 100 కోట్లకు చేరిపోవడం ఖాయం.