దక్షిణాదిన ఇద్దరే ఇద్దరూ సూపర్ స్టార్స్.. ప్రేక్షకులు వాళ్లను హీరోలుగా ఎప్పుడూ చూడలేదు. నటుడి స్థాయి నుంచి దాదాపు దేవుళ్లు అయ్యారు ఆ ఇద్దరు హీరోలు. వాళ్లే ఎన్టీఆర్ అండ్ ఎంజిఆర్. నందమూరి తారక రామారావు గురించి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎంజి రామచంద్రన్ గురించి కూడా పెద్దగా పరిచయం అవసరం లేదు. తమిళ సినిమాతో కాస్త కనెక్షన్ ఉన్నాళ్లకు ఈ పేరు ఇట్టే తెలిసిపోతుంది. నల్ల కళ్ల జోడు పెట్టుకుని.. మెల్లో ఎప్పుడూ ఓ శాలువా.. తలపై ఓ టోపీతో ఓ రూపం మన కళ్లలో కనిపిస్తుంది. ఎన్టీఆర్.. ఎంజిఆర్ ఇద్దరూ అగ్ర నటులే. చెరో హీరో చెరో ఇండస్ట్రీని ఏలేసారు. తమిళనాట ఎంజీఆర్ కంటే గొప్ప హీరో కానీ.. గొప్ప నేత కానీ లేడు. అలాగే తెలుగునాడులో కూడా అంతే. ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు కానీ గొప్ప నేత గానీ లేరు. వీళ్లిద్దరూ పర్సనల్ గా కూడా చాలా మంచి స్నేహితులు. కేవలం నటులుగానే కాకుండా ప్రజాసేవలో ఒకర్ని ఒకరు అభినందించుకునేవాళ్లు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ లో ఎంజిఆర్ పాత్రధారి ఒకరు కనిపించారు. ఈ చిత్ర ఓపెనింగ్ లో దానవీరశూరకర్ణ సీన్ చూపించాడు తేజ. అప్పట్లో ఆ చిత్ర ఓపెనింగ్ ఎంజిఆర్ చేతుల మీదుగా జరిగింది. అదే సీన్ ఇప్పుడు బయోపిక్ లో చూపించబోతున్నాడు తేజ. ఇది చూసి అప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ మధ్య ఉన్న స్నేహం గుర్తొచ్చింది అందరికీ. ఆ రోజుల్లో ప్రతీచిన్న పనికి కూడా ఒకరి సాయం ఒకరు తీసుకునే వాళ్లు ఈ ఇద్దరూ నాయకులు. మొత్తానికి ఇద్దరి పేర్లు మూడక్షరాలే.. ఇద్దరూ మహానుభావులే.