రంగస్థలం రచ్చ మొదలైంది. ఇన్నాళ్లూ ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని వేచి చూసిన అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమాకు తొలి రోజు తొలి షో నుంచి అదిరిపోయే టాక్ వచ్చింది.
మూడు గంటల సినిమాను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమాలో ఎమోషన్స్ కూడా అద్భుతంగా కనెక్ట్ కావడంతో తిరుగులేకుండా పోయింది. కలెక్షన్ల విషయంలోనూ రంగస్థలం రచ్చ రచ్చ చేస్తుంది. తొలిరోజు ఈ చిత్రం ఏకంగా 24 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.
తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 19.90 కోట్లకు పైగా షేర్ సాధించి ఔరా అనిపించింది. తెలుగులో ఆల్ టైమ్ టాప్ కలెక్షన్ లిస్ట్ లో ఆరో స్థానంలో నిలిచింది రంగస్థలం. బాహుబలి 2 42 కోట్లతో టాప్ తో ఉండగా.. 27 కోట్లతో అజ్ఞాతవాసి.. 23 కోట్లతో ఖైదీ నెం.150.. 22 కోట్లతో కాటమరాయుడు..
21.70 కోట్లతో సర్దార్.. 21.40 కోట్లతో జై లవకుశ.. 21.30 కోట్లతో జనతా గ్యారేజ్ ముందున్నాయి. ఇప్పుడు 19.90 కోట్ల షేర్ తో రంగస్థలం ఆరో స్థానంలో నిలిచింది. తమిళనాడు.. కర్ణాటకలోనూ అద్భుతమైన వసూళ్లు సాధిస్తుంది ఈ చిత్రం.
ఇక ఓవర్సీస్ లో అయితే అరాచకాలు చేస్తున్నాడు చరణ్. అక్కడ తొలిరోజు ప్రీమియర్స్ తో కలిపి 1.2 మిలియన్ వచ్చేసింది. ఇది నాన్ బాహుబలి రికార్డుల్లో మూడో స్థానం. ఈ దూకడు చూస్తుంటే మూడు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ అందుకున్నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. మొత్తానికి రామ్ చరణ్ చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న ఆ విజయం ఇప్పుడు రంగస్థలంతో వచ్చేలాగే కనిపిస్తుంది.