అదేంటి.. ఫ్యాన్స్ లేకపోతే హీరోలెక్కడ ఉన్నారు..? అలాంటిది ఫ్యాన్స్ లేకపోతే ఎలా..? అయినా చరణ్ అలా ఎందుకన్నాడు అనుకుంటున్నారా..? అలా చరణ్ అనడం వెనక ఓ కథ ఉంది. రంగస్థలం థ్యాంక్స్ మీట్ లో చరణ్ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇన్నాళ్లూ రొటీన్ కథలు చేసాడు చరణ్. ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటూ వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని కొత్త కథలవైపు అసలు అడుగేయలేదు. దాంతో పదైళ్లైనా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుండి చరణ్ కెరీర్. దాంతో ధృవ నుంచి ఫ్యాన్స్ ను పక్కనబెట్టేసాడు చరణ్. తనకు నచ్చిన కథలు.. కొత్తగా ఉండే కథల వైపు అడుగేస్తున్నాడు మెగా వారసుడు. ఆ క్రమంలోనే ఇప్పుడు రంగస్థలం కూడా వచ్చింది. ఈ చిత్రం సృష్టిస్తోన్న సంచలనాల గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. థ్యాంక్స్ మీట్ లో చరణ్ మాట్టాడుతూ.. అభిమానులను దృష్టిలో పెట్టుకుని కేవలం వాళ్లకు మాత్రమే నచ్చేలా సినిమా చేయాలంటే మాత్రం… రంగస్థలం వంటి మంచి సినిమా వచ్చి ఉండేది కాదని చెప్పాడు చరణ్.
అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తారా అని చాలా మంది తనను అడుగుతున్నారని.. నిజం చెప్పాలంటే కథ ముందుగా నచ్చాల్సింది తనకు అని చెప్పాడు చరణ్. తనకు నచ్చితే అభిమానులతో పాటు కుటుంబానికి.. అందరికీ గర్వపడే రంగస్థలం లాంటి సినిమాలు వస్తాయంటున్నాడు మెగా వారసుడు. ఒకవేళ తాను కానీ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే కమర్షియల్ హీరోని కాదని చెప్పాడు చరణ్. తనను.. నటీనటులందరినీ… టెక్నికల్ టీం అందరినీ నమ్మి. తన విజన్ ను తెరకెక్కించిన సుక్కూకి థ్యాంక్స్ అని చెప్పాడు ఈ హీరో. సినిమా విజయవంతం అయిన దాని కంటే తనను నమ్మి సినిమాను కొన్నవారికి కొన్ని డబ్బులు వచ్చాయని తెలిసి సంతోషంగా ఉందన్నాడు ఈ హీరో. వచ్చిన డబ్బులను మళ్లీ ఇంకో సినిమా మీద పెట్టే బయ్యర్లు… డిస్టిబ్యూటర్లు సంతోషంగా ఉంటేనే సినిమాలు తీసే తాము కూడా సంతోషంగా ఉంటామని చెప్పాడు చరణ్. ఈయన మాటతీరులో కూడా చాలా మార్పు వచ్చింది. మరి ఇదే మార్పు ఇకపై వచ్చే సినిమాల్లోనూ కనిపిస్తే చరణ్ ను కొట్టేవాళ్లే ఉండరేమో..?