నెల గ్యాప్ లో రెండు సినిమాలు.. రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు.. అంటూ రజినీకాంత్ అభిమానులు తెగ కలలు కనేసారు. ఎప్రిల్లో 2.0 వస్తుంది.. ఆ వెంటనే జూన్ లో కాలా వచ్చేస్తుందంటూ ఆ మధ్య తెగ కబుర్లు చెప్పారు దర్శక నిర్మాతలు. కానీ అనుకున్నది జరిగితే అది రజినీ సినిమా ఎందుకు అవుతుంది..?
ఇప్పుడు 2.0 వెనక్కి వెళ్లిపోయింది. ఎప్పుడు వస్తుందో.. ఎప్పటికి పూర్తవుతుందో తెలియనంత కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోయింది ఈ చిత్రం. ఇక మిగిలిన కాలా ఎప్రిల్ 27 అని డేట్ ఫిక్సయింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కూడా తిప్పలు తప్పేలా లేవు. మార్చ్ 16 నుంచి తమిళ ఇండస్ట్రీ బంద్ నడుస్తుంది. నెల రోజులైనా ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాలేదు.
దాంతో ఏ సినిమా కూడా ఇప్పుడు విడుదల కావట్లేదు. ఎలాగోలా కాలా సెన్సార్ అయితే పూర్తయింది. కానీ సినిమా మాత్రం కచ్చితంగా చెప్పినట్లుగా ఎప్రిల్ 27కే వస్తుందనే నమ్మకం అయితే లేదు. మరీ రెండు వారాల్లోనే అన్నీ పూర్తిచేసి ప్రమోషన్ తో పాటు సినిమా విడుదల చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే దాదాపు 200 కోట్ల బిజినెస్ చేసిన సినిమాను ఇంత హడావిడిగా విడుదల చేస్తే అసలుకే మోసం వస్తుంది.
బంద్ ప్రశాంతంగా ముగిస్తే మంచిది.. లేదంటే మాత్రం మరోసారి రజినీ అభిమానులకు నిరాశ తప్పదు. పైగా రజినీ గత సినిమాలు కబాలి.. లింగా.. కొచ్చాడయాన్ పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో కాలా విషయంలో నిదానమే ప్రధానం అంటున్నాడు సూపర్ స్టార్. చూడాలిక.. చివరివరకు ఏం జరుగుతుందో..?