నటకిరీటీ.. కామెడీ కింగ్.. నవసర నటన ధురంధరుడు.. ఇవన్నీ రాజేంద్రప్రసాద్ కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బిరుదులు. వీటన్నింటికీ న్యాయం చేయగల సమర్ధుడే ఈయన. 40 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించాడు రాజేంద్రుడు. స్టార్ హీరోలు రాజ్యమేలుతున్న టైమ్లో కూడా ఆయన తన కామెడీతో బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకున్నాడు. ఇలాంటి హీరో ఇప్పటి వరకు మళ్లీ రాలేదు.. ఇకపై రాడు కూడా.
ఈయన స్థానం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇలాగే ఉంది. సాక్షాత్తు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా రాజేంద్రప్రసాద్ కు పెద్ద అభిమాని. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు మాత్రమే ఉన్నారు. కానీ కామెడీ హీరోలు కూడా ఉండాలని.. ఉంటారని.. స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలేయొచ్చని నిరూపించింది మాత్రం రాజేంద్రుడే.
ఈయన హీరోగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థానం ఇప్పటికీ అలాగే ఉంది. ఎంతోమంది కామెడీ హీరోలు వచ్చినా.. రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేకపోయారు.
ఇంతటి ఇమేజ్ సంపాదించుకున్న రాజేంద్రప్రసాద్ ఇప్పుడు తన ఇమేజ్ తానే తీసుకుం టున్నాడని అభిమానులు బాధ పడుతున్నారు. లేకపోతే మరేంటి..? ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో తండ్రి, బాబాయ్ పాత్రల్లో నటిస్తున్నాడు ఈ హీరో. అలాంటివి కాకుండా ఇప్పటికీ కొన్ని సినిమాల్లో హీరోగానూ నటిస్తున్నాడు రాజేంద్రప్రసాద్.
ఇదే ఈయన ఇమేజ్ ను దెబ్బతీస్తుంది. ఆఫర్ లు బోలెడు వస్తున్నా కూడా ఇప్పటికీ కొన్ని ఊరుపేరు లేని సినిమాల్లో నటిస్తున్నాడు రాజేంద్రుడు. అసలు ఈయనకు అంత అవసరం ఏమొచ్చింది..? ఇంత మంచి పేరును అలాంటి సినిమాల్లో నటించి ఎందుకు పాడు చేసుకుంటున్నాడని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. తాజాగా ఉపెకుహ అనే ఓ సినిమా వస్తుంది. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరో.
ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి పూర్తి టైటిల్. ఇది రాజేంద్రుడు నటించాల్సిన సినిమానా..? ఇలాగే నటిస్తూ పోతే ఉన్న ఆ కాస్త ఇమేజ్ కూడా పోతుందని ఫీల్ అవుతున్నారు ఆయన అభిమానులు. మరి ఇప్పటికైనా వాళ్ల గోడును ఈయన పట్టించుకుంటాడో లేదో..?