అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పాడు నేను ట్రెండ్ ఫాలో కాను.. సెట్ చేస్తానని. కానీ ఆయన సెట్ చేస్తున్నాడో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈయన ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇక్కడ గాడ్ ఫాదర్ లేనప్పుడు ఎవరి కెరీర్ వాళ్లే డిజైన్ చేసుకోవాలి.
ఈ విషయంలో ఆరితేరిపోయాడు విజయ్. లేకపోతే ఒక్క సినిమా హిట్టైతే ఇంత క్రేజ్ వస్తుందా..? కానీ విజయ్ కు వచ్చింది.. గతేడాది ఆగస్ట్ 25న అర్జున్ రెడ్డి విడుదలైంది. అప్పట్నుంచీ ఇప్పటి వరకు పెద్ద సినిమాలేవీ రాలేదు. కానీ ప్రస్తుతం మనోడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు సినిమాలు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి. అందులో ఆగస్ట్ 15న గీతగోవిందం విడుదలకు సిద్ధమైంది. ట్యాక్సీవాలాని వెనక్కి పంపించి.. గీతాగోవిందాన్ని ముందు విడుదల చేస్తున్నాడు అల్లు అరవింద్.
కొత్త దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ ట్యాక్సీవాలాను తెరకెక్కిస్తే.. పరుశురామ్ గీతగోవిందం సినిమాకు దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రంలోని ఇంకేం కావాలి సాంగ్ మార్మోగిపోతుంది. దానికితోడు మనోడు చేసిన వాట్ ది ఎఫ్ రచ్చ మామూలుగా లేదు. ఇవన్నీ ఇలా ఉండగానే ఆడియో వేడుకలో లుంగీ కట్టుకుని వచ్చి రచ్చ చేసాడు. ఈ రెండు సినిమాలతో పాటు తెలుగు, తమిళ్ లో ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తోన్న నోటా సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది.
ఈ చిత్ర చివరి షెడ్యూల్ ఈ మధ్యే చెన్నైలో పూర్తైపోయింది. దాంతోపాటు డియర్ కామ్రేడ్ ను కూడా ఈ మధ్యే మొదలు పెట్టాడు విజయ్. ఇవన్నీ ఇలా ఉంటే సోషల్ మీడియాలోనూ విజయ్ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈయన రౌడీ క్లబ్ పేరుతో ఓపెన్ చేసిన క్లాత్ షోరూం ఇప్పుడు రచ్చ చేస్తుంది. ట్రెండింగ్ లో ఉంది ఈ యాప్. ఇప్పటికే ఫస్ట్ స్టాక్ కూడా బయటికి వచ్చేసింది. మొత్తానికి హీరోగానే కాదు.. బిజినెస్ లోనూ రప్ఫాడిస్తున్నాడు విజయ్ దేవరకొండ.