పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది సమంత. ఇప్పటికీ ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. స్యామ్ కోసం ప్రత్యేకంగా కథలు కూడాసిద్ధం చేస్తున్నారు. అయితే సమంత మాత్రం భర్తతో ఎంజాయ్ చేస్తుంది. ఫారెన్ ట్రిప్ లో నాగచైతన్యతో ఉంది ఈ ముద్దుగుమ్మ. వచ్చిన తర్వాత వరస సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది స్యామ్. చైతూతో ప్రస్తుతం మజిలి సినిమా చేస్తున్న సమంత.. ఆ తర్వాత నందిని రెడ్డితో మిస్ గ్రానీ సినిమా రీమేక్ లో నటించబోతుంది. ఈ చిత్రం కొరియన్ సినిమాకు రీమేక్. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు కథను కూడా మార్చేసింది నందిని రెడ్డి.
ఇక ఇప్పుడు ఈ చిత్రానికి తెలుగు టైటిల్ కోసం చాలా కష్టపడుతున్నారు యూనిట్. దీనికి ముందు మిస్ గ్రానీ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు కానీ అలాంటి టైటిల్ ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా నచ్చదని భావిస్తుంది సమంత. అందుకే ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓ బేబీ అనే టైటిల్ కూడా అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు అది కూడా వద్దనుకునేసరికి ఎంత సక్కగున్నవే అనే టైటిల్ వైపు సమంత అడుగులు పడుతున్నాయి. రంగస్థలం సినిమాలో ఈ పాట ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో ఇదే పాట లిరిక్ ను ఇప్పుడు తన సినిమా కోసం వాడేసుకోవాలని చూస్తుంది సమంత. ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలు కూడా సమంత కోసం వేచి చూస్తున్నాయి.