ఒకప్పుడు బాలకృష్ణ తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళింది అంటూ కొన్నేళ్లపాటు ఆయన్ని వెక్కిరిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో చాన్స్ దొరికిన ప్రతి సారి బాలకృష్ణ వీడియోలు పెట్టి ఆయన అభిమానులను ఏడుస్తూనే ఉంటారు యాంటీ ఫ్యాన్స్. అలాంటి వాళ్లకు రామ్ చరణ్ సినిమా దొరికింది. తాజాగా విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది.150 కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతున్న ట్రైన్ పై రామ్ చరణ్ బ్రిడ్జి మీద నుంచి దూకుతాడు. అక్కడే రెండు నిమిషాలపాటు పైనే ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ప్రేక్షకులు.
ఇలాంటి సీన్ లు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు దర్శకులు తీస్తున్నారా అంటూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడో పదేళ్ల కింద వదిలేసిన అతిని బోయపాటి శ్రీను మళ్ళీ తెలుగు సినిమాకు పరిచయం చేశాడు. ఈ సీన్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. సినిమా డిజాస్టర్ కావడంలో ఈ సీన్స్ ముఖ్య పాత్ర పోషించాయి. దాంతో ఇప్పుడు సినిమా నుంచి ఈ సన్నివేశాలను తొలగించారు దర్శక నిర్మాతలు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి. ఈ జాగ్రత్త కాస్త ముందు తీసుకొని ఉంటే సినిమాకు ఇంత దారుణమైన టాక్ వచ్చి ఉండేది కాదు అంటున్నారు విశ్లేషకులు. ఏదైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఇప్పుడు ఆ సన్నివేశాలు తీసిన పెద్దగా ప్రయోజనం లేదు.