అవును కథానాయకుడు సినిమా ఎందుకు ఇంతపెద్ద డిజాస్టర్ అయిపోయింది. దీనికి కారణాలు ఎవరైనా కనుక్కున్నారా.. కనుక్కుంటే మాత్రం అందరూ చెబుతున్న మాట ఒక్కటే. కథానాయకుడు సినిమా ఇంతగా నిరాశపరచడానికి అందులో బాలయ్యే కారణం అంటున్నారు విశ్లేషకులు. ఇందులో నిజం కూడా లేకపోలేదు.. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడు.. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ముఖ్యంగా నందమూరి తారకరామారావును గుర్తుచేశాడు బాలకృష్ణ. అయితే ఎంత బాగా చేసినా కూడా ఆయన వయసును మాత్రం సినిమాలో దాచలేకపోయారు. కథానాయకుడు ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య అంత బాగా లేడనే విమర్శలు వినిపించాయి. చివరికి ఇదే సినిమా పరాజయం లో ప్రధాన పాత్ర పోషించింది.
ఒకవేళ కుర్ర ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ తో చేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటించే సినిమా అంటే తారా స్థాయిలో ఉంటాయి. అందులోనూ అది ఎన్టీఆర్ బయోపిక్ అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. కానీ బాలకృష్ణ రెండు పాత్రలు తనే చేయడంతో ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. 60 ఏళ్లు దాటిన తర్వాత ఎన్టీఆర్ గెటప్ లో అచ్చు గుద్దినట్లు సరిపోయిన బాలయ్య.. కుర్ర ఎన్టీఆర్ పాత్రకు మాత్రం న్యాయం చేయలేకపోయాడు. దానికి తోడు సినిమాలో ఎమోషనల్ కంటెంట్ లేకుండా ఎన్టీఆర్ భజన మాత్రమే ఉండటంతో అస్సలు నచ్చలేదు. మొత్తానికి ఇప్పుడు కారణాలు విశ్లేషించి లాభం లేదు.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.