అక్కినేని నాగేశ్వ‌ర‌రావు 5వ వ‌ర్ధంతి నేడు..

రాముడిగా త‌న ప్ర‌యాణం మొద‌లుపెట్టాడు.. భ‌క్తుడిగా ఎన్నో సినిమాలు చేసాడు.. అన్ని ర‌కాల పాత్ర‌ల్లోనూ మెప్పించాడు.. ప్ర‌పంచంలో 75 ఏళ్లకు పైబ‌డి న‌ట‌నా అనుభ‌వం ఉన్న ఏకైక న‌టుడు.. న‌డిచే న‌ట భాండాగారం.. న‌వ‌ర‌స న‌ట‌భూష‌ణుడు.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావ్. 1923, సెప్టెంబ‌ర్ 20న కృష్ణా జిల్లా రామాపురంలో జ‌న్మించారు అక్కినేని. ఈయ‌న తొలి సినిమా సీతారామ జ‌న‌నం.. చివ‌రి సినిమా మ‌నం. రాముడి పాత్ర‌తో మొద‌లైన అక్కినేని సినీప్ర‌యాణం.. రామరాజ్యంలో వాల్మీకితో పూర్తికావ‌డం విశేషం. అది కావాల‌నే ఆయ‌న ప్లాన్ చేసుకున్నారు కూడా. త‌ను నిజంగానే అక్క‌డితోనే ఆగిపోతే రాముడితో మొద‌లై.. వాల్మీకితో ముగిసింద‌ని సంతోషిస్తాను అని నాగేశ్వ‌ర‌రావే చెప్పారు.

ఎలాంటి చ‌దువు సంధ్య‌లు లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈయ‌న‌.. చ‌దువుకోని ప‌ట్ట‌భ‌ద్రుడిగా మారారు. ఇక్క‌డ జీవిత‌మే అన్నీ నేర్పిస్తుంద‌ని న‌మ్మిన మ‌నిషి ఏఎన్నార్. ఏనాడూ ఈయ‌న దేవున్ని న‌మ్మ‌లేదు.. మ‌నిషిలోనే దేవుడు ఉన్నాడ‌ని న‌మ్మిన వ్య‌క్తి. త‌న‌కు తొలి అవకాశం ఇచ్చిన ఘంట‌సాల బ‌ల‌రామ‌య్యే త‌న‌కు దేవుడు అంటాడు ఏఎన్నార్. ఆయ‌న న‌టుడిగా ఒక్కో మెట్టు ఎక్క‌డానికి ప‌డిన క‌ష్టం అంద‌రికీ స్పూర్థిదాయ‌కం. త‌నలోని లోపాలేంటో అక్కినేనికి బాగా తెలుసు. అందుకే అన్నీ ద‌గ్గ‌ర‌కుండి మ‌రీ స‌రి చేసుకున్నాడు.

ఎన్టీఆర్ తో పోలిస్తే.. తాను చాలా విష‌యాల్లో వెన‌క‌బ‌డి ఉంటాన‌ని చెప్పేవారు అక్కినేని. అందుకే త‌న‌కు ఏ పాత్ర‌లైతే స‌రిపోతాయో అవి మాత్ర‌మే ఎంచుకునేవాళ్లు కానీ ఎన్టీఆర్ పోటీప‌డి ఆయ‌న చేసే పాత్ర‌లు చేస్తూ త‌న కెరీర్ కు ముప్పు అని ముందే గ్ర‌హించారు అక్కినేని. భ‌క్తుడి పాత్ర‌ల్లో అక్కినేని మిన‌హా మ‌రొక‌రు లేర‌ని నిరూపించుకున్నారు ఏఎన్నార్. వ్య‌క్తిత్వంలోనూ అక్కినేని ఓ శిఖ‌ర‌మే. ధైర్యంగా ముంద‌డుగేయ‌డంలో అక్కినేనికి సాటిరారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ క‌ట్టొద్ద‌ని.. క‌డితే న‌ష్ట‌పోతార‌ని ఇండ‌స్ట్రీ అంతా ఏక‌మై బెదిరించినా, భ‌య‌పెట్టినా వెన‌క‌డుగేయ‌లేదు అక్కినేని. అలాగే ఇండ‌స్ట్రీని హైద‌ర‌బాద్ కు త‌ర‌లించ‌డంలోనూ అక్కినేనిదే కీల‌క‌పాత్ర‌. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి విషయంలోనూ అక్కినేని చూపిన ధైర్యం హ‌ర్ష‌నీయం. చ‌నిపోతాను అని తెలిసినా కూడా ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పాడు. 75 ఏళ్ల కెరీర్ లో 255 చిత్రాల్లో న‌టించిన ఏఎన్నార్.. చివ‌రి సినిమా మ‌నంలో త‌న కొడుకు, మ‌న‌వ‌ళ్ళ‌తో క‌లిసి న‌టించారు. జ‌న‌వ‌రి 22, 2014న అనారోగ్యంతో క‌న్నుమూసారు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.

anr death anniversary

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here