ఉన్నట్లుండి టాలీవుడ్ లో అలజడి.. కమెడియన్ బ్రహ్మానందంకి ఏదో అయిపోయింది అనే వార్తలు సోషల్ మీడియాలో బాగానే వినిపించాయి. ఆరోగ్యంగా ఉన్న ఆయనకు బైపాస్ సర్జరీ జరగడం అభిమానుల్లో లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. అసలు బ్రహ్మానందం కి ఏమైందో తెలియక అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఇప్పుడు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి ముందు రోజు ఆయనకు చాతిలో కాస్త నొప్పి రావడంతో ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లి బైపాస్ సర్జరీ చేయించారు కుటుంబ సభ్యులు.
ఇది కేవలం ముందు జాగ్రత్త కోసం చేసింది కానీ ఆయన ఆరోగ్యం పరంగా ఎలాంటి ఆందోళన లేదని ఆయన కుమారుడు గౌతం వెల్లడించాడు. బ్రహ్మానందం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు వైద్యులు. ఆయన త్వరలోనే హైదరాబాద్కు వస్తారని వచ్చిన తర్వాత అభిమానులను ప్రత్యేకంగా కలుస్తారని చెబుతున్నాడు గౌతమ్. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దని అభిమానులకు అభయమిచ్చాడు బ్రహ్మానందం తనయుడు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ బ్రహ్మీ ఇంటికి క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.