ఇండస్ట్రీలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమాషాలు చేస్తూ కూర్చుంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ లేరంటున్నాడు దిల్ రాజు. థియేటర్ల వివాదానికి తాజాగా ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పేట ప్రీ రిలీజ్ వేడుకలో ఆ చిత్ర నిర్మాత అశోక్ వల్లభనేని మాట్లాడిన మాటలకు దిల్ రాజు కౌంటర్ ఇచ్చాడు. ఆరు నెలల ముందు నుంచే సంక్రాంతి పండక్కి వస్తున్నానంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న మేము పిచ్చోళ్ళమా అంటున్నాడు దిల్ రాజు. ఎప్పటి నుంచో పండక్కి రావాలని తమ సినిమాలను ముస్తాబు చేసుకుంటున్నామని.. అలాంటిది ఇప్పటికిప్పుడు ఏదో హడావిడిగా వారం రోజుల్లో సినిమాలు తీసుకొచ్చి థియేటర్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ప్రశ్నిస్తున్నారు దిల్ రాజు.
పైగా అనువాద సినిమాకు థియేటర్లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు. ఇక్కడ తెలుగు సినిమాలకే థియేటర్లు లేక చచ్చిపోతుంటే డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నాడు. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పోయేది వాళ్ల పరువే అంటున్నాడు ఈ నిర్మాత. ముందు వెనుక ఆలోచించకుండా అశోక్ వల్లభనేని అనుచిత వ్యాఖ్యలు చేశారన్నాడు దిల్ రాజు. జనవరి 18 నుంచి థియేటర్స్ దొరుకుతాయని అశోక్ కు తెలిసినప్పుడు తన సినిమాను అప్పుడే విడుదల చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు ఈ నిర్మాత. మొత్తానికి ఈ వార్ ఎక్కడ ముగుస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.