ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా పై సంచలన సమాధానం చెప్పాడు దర్శకుడు తేజ. ఈ సినిమాను ముందు ఆయనే డైరెక్ట్ చేయాలి. భారీ స్థాయిలో ఓపెనింగ్ కూడా జరిగింది. అప్పట్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ వేడుకకు వచ్చారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా ఒక రోజు నుంచి తప్పుకున్నాడు.. కారణం అడిగితే ఎవరు చెప్పలేదు. బాలయ్య మాత్రం సినిమా విడుదలకు ముందు ఇంత భారీ ప్రాజెక్టు తెరకెక్కించడం తన వల్ల కాదు అంత భారం నేను మోయలేను అంటూ తేజ తప్పుకున్నాడని చెప్పాడు. ఇక ఇప్పుడు ఈ విషయంపై తేజ మాట్లాడాడు.. ప్రస్తుతం ఈయన బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా సీత సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ లో భాగంగా మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పాడు తేజ. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూశారా అని అడిగితే సమయం దొరకలేదు.. అందుకే చూడలేదు అంటూ సెటైర్ వేశాడు. తాను వదిలేసిన సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి కచ్చితంగా ప్రతి దర్శకుడులోను ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం సింపుల్ గా సినిమా చూడలేదు అని చెప్పి తప్పించుకున్నాడు. ఒకవేళ చూస్తే ఎలా ఉంది అని మరో ప్రశ్న ఎదురవుతుంది.. అందుకే చూడలేదని చెప్పి సింగిల్ ఆన్సర్ తో అందరి నోరు మూయించాడు తేజ.