పండక్కి నాలుగు సినిమాలు వస్తున్నాయి అంటే కచ్చితంగా ఒక దాని ప్రభావం మరో సినిమాపై పడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ వచ్చిన నాలుగు సినిమాల్లో 3 ఫ్లాప్ అయ్యేసరికి ఒక్కరు మాత్రమే పండగ చేసుకుంది ఎఫ్2. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నా 12 రోజుల్లో 100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అటు వెంకటేష్.. ఇటు వరుణ్ తేజ్ లకు ఇది తొలి 100 కోట్ల సినిమా. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తొలిసారి 100కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఎఫ్2 సినిమా ఎక్కడా తగ్గలేదు.
ఓవర్సీస్లో కూడా 2 మిలియన్ వైపు పరుగులు తీస్తుంది ఎఫ్2. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా దూకుడుకు అడ్డే లేదు. తొలిరోజు నాలుగు కోట్ల 70 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం విడుదలైన 10వ రోజు కూడా నాలుగు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా దూకుడు ఎలా ఉందో. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లు దాటేసింది ఎఫ్2. పరిస్థితి చూస్తుంటే మరో పది పదిహేను కోట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం 75 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఎఫ్2కు సీక్వెల్ కూడా చేస్తానని ప్రకటించాడు అనిల్ రావిపూడి.