నిర్మాతగా బాలయ్య ఏదో అద్భుతాలు చేస్తాడని అభిమానులు కూడా బాగానే ఆశించారు. ఏకంగా తండ్రి సినిమా బయోపిక్ తోనే నిర్మాతగా మారడంతో బాలకృష్ణ తొలి సినిమాతో సంచలనం సృష్టించడం ఖాయమని వాళ్ళు బలంగా నమ్మారు. కానీ అందరి నమ్మకాలను వమ్ము చేస్తూ కథానాయకుడు డిజాస్టర్ అయిపోయింది. ఈ సినిమా నష్టాలను తలుచుకుంటూ బాధపడుతున్నాడు బాలయ్య.
కనీసం 70 కోట్లు సాధిస్తుంది అనుకున్న సినిమా ఇప్పుడు ఇరవై కోట్ల దగ్గరే ఆగిపోవడంతో బాలకృష్ణతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ సినిమాని నష్ట పోయిన వాళ్ళని ఆదుకుంటానని చెప్పాడు బాలకృష్ణ. మహానాయకుడు సినిమాను వాళ్లకి ఉచితంగా ఇవ్వబోతున్నాడు ఈ నిర్మాత. అయితే మహానాయకుడు సినిమాను ఉచితంగా ఇవ్వడం.. నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవడం పక్కన పెడితే అంచనాలు పెట్టుకున్న కథానాయకుడు ఇంత దారుణంగా చేయడం మాత్రం ఎవరికీ నచ్చడం లేదు. నిర్మాతగా బాలకృష్ణ తొలి సినిమాతోనే ఇంత పెద్ద డిజాస్టర్ అందుకోవడం అభిమానులకు కూడా రుచించడం లేదు. ఈ లోటును మహానాయకుడు సినిమాలో బాలకృష్ణ భర్తీ చేస్తాం అని ధీమాగా చెబుతున్నారు బాలయ్య. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి మరి కథానాయకుడు రుణం బాలకృష్ణ తీర్చుకుంటాడో లేదో చూడాలి.