రజనీకాంత్ సినిమా అంటే ఎలా ఉంటుందో అభిమానులకు ఒక క్లారిటీ ఉంది.. కానీ కొన్నేళ్లుగా ఆ క్లారిటీ మిస్ అవుతుంది దర్శక నిర్మాతలకు. ఆయనను ఎలా చూపించాలో అలా చూపించలేక అనవసరంగా ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు దర్శకులు. ఒకప్పుడు రజనీకాంత్ కు ఉన్న ఇమేజ్ ఇప్పుడు ఉన్న ఇమేజ్ బేరీజు వేయడం కష్టం. ఎందుకంటే అప్పట్లో సూపర్ స్టార్ సినిమా వచ్చిందంటే సంచలనాలు తప్పనిసరి.. కాని ఇప్పుడు ఆయన సినిమా వస్తే నష్టాలు తప్పనిసరి అయిపోయాయి. ఎలాంటి హీరోకైనా కచ్చితంగా ఏదో ఒక రోజు ఎక్స్పైరీ ఉంటుందంటే ఏమో అనుకున్నాం కానీ రజనీకాంత్ కూడా అది దగ్గరగానే ఉంది అని అర్థం అయిపోతుంది.
కొన్నేళ్లుగా ఆయన నటించిన ఒక్క సినిమా కూడా బయ్యర్లకి లాభాలు తీసుకురాలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య విడుదలైన పేట సినిమా కూడా ఏదో సోసోగా ఆడిందే కానీ లాభాలు మాత్రం తీసుకురాలేదు. దాంతో ఇప్పుడు ఈయన పారితోషికంలో భారీగా కోత పడిందని తెలుస్తోంది. మురుగదాస్ సినిమా కోసం ఈయన చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సినిమాకు దాదాపు 70 నుంచి 80 కోట్లు తీసుకునే రజనీకాంత్.. ఈ సారి మాత్రం అందులో సగం కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.. దసరాకు సినిమా విడుదల కానుంది.