బయోపిక్స్ తెరకెక్కించాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో విశేషాలు ఉండాలి.. కానీ ఇప్పుడు బయోపిక్ అర్థాన్ని మార్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. జీవితంలో వివాదాలు ఉంటే చాలు అంటున్నారు. అందుకే వరుసగా తెరకెక్కుతున్న బయోపిక్ లలో విషయం కంటే ఎక్కువగా వివాదం ఉంటుంది. అందుకే వాటిపై కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. బాలీవుడ్లో కూడా ఇప్పుడు రెండు బయోపిక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. విడుదలకు ముందే చాలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రెండు సినిమాలు. అవే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్.. థాకరే సినిమాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ జనవరి 11న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సంచలనం సృష్టించింది. దీన్ని యూట్యూబ్ నుంచి కూడా తొలగించాలని కోర్టు సైతం ఆర్డర్ ఇచ్చిందంటే ఇందులో వివాదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఈజీగా అర్థమైపోతుంది. అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ గా నటించారు.
మన్మోహన్ పిఏ సంజయ్ బరు రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశానికి సంబంధించిన కొన్ని సీక్రేట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు థాకరే సినిమాపై కూడా ఇలాంటి అంచనాలు వివాదాలు నడుస్తున్నాయి. బాల్ థాకరే జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కూడా విడుదల కాకుండా ఆపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇది విడుదలైతే కచ్చితంగా గొడవలు రేపుతాయని కోర్టు సైతం భయపడుతుంది. దాంతో విడుదలకు ముందే సెన్సార్ లో చాలా సీన్లు తీసేయాలని వాదన వినిపిస్తోంది. మొత్తానికి విడుదలకు ముందే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్.. థాకరే సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి రేపు వచ్చిన తర్వాత ఇంకెన్ని సంచలనాలకు నెలవవుతాయో.