సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ పూర్తి చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్.. ఎఫ్2.. పేట సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు చివరగా రామ్ చరణ్ వినయ విధేయ రామ కూడా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా దీనికి యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు.
సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ కాకుండా ఎమోషనల్ గా సాగిందని చెబుతున్నారు వాళ్ళు. కచ్చితంగా కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించేలా ఈ సినిమా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు బోయపాటి శ్రీను. రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.
ఈ సినిమాతో సంక్రాంతికి హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు మెగా వారసుడు. రొటీన్ స్టోరీ అయినా కూడా స్క్రీన్ ప్లేలో కొత్తదనం చూపించాడు బోయపాటి శ్రీను అంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. దానికితోడు యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలో మాదిరి ఉన్నాయని వాళ్లు కితాబిచ్చేశారు. రామ్ చరణ్ మాస్ ఇమేజ్ సినిమాకు ప్లస్ కానుంది. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా ప్రభావం కలెక్షన్లపై ఉంటుందని అంచనా వేస్తున్నారు చిత్రయూనిట్. మరి వీళ్ల నమ్మకాలు ఎంతవరకు నిలబెడతాయో జనవరి 11న తేలనుంది.