వాళ్లిద్ద‌రి మ‌ధ్య‌లో మ‌హాన‌టి..


ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వాయిదాల ప‌ర్వం న‌డుస్తుంది. ఓ సినిమా విడుద‌ల తేదీ అనౌన్స్ చేయ‌డం.. దాన్ని మార్చ‌డం ఇప్పుడు ఫ్యాష‌న్ అయింది. ఇప్ప‌టికే చాలా సినిమాల విడుద‌ల తేదీలు మారిపోయాయి. ఇప్పుడు ఇదే లిస్ట్ లో మ‌హాన‌టి కూడా చేరిపోయింది. చేతిలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది కాబ‌ట్టి మార్చ్ 29న రంగ‌స్థ‌లానికి పోటీగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాలనుకున్నారు. కానీ సిజి వ‌ర్క్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఆల‌స్యం కావ‌డంతో సినిమా మే 9కి వాయిదా ప‌డింది. ఉగాది సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్ తో పాటు కొత్త విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించారు. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రానికి అశ్వినీద‌త్ నిర్మాత‌. అయితే ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చి ప‌డింది. మ‌హాన‌టి రెండు భారీ సినిమాల మ‌ధ్య పోటీకి సిద్ధ‌మ‌వుతుంది. మే 4న నా పేరు సూర్య విడుద‌ల కానుంది.. మే 11న సాక్ష్యం రానుంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య వ‌స్తుంది మ‌హాన‌టి. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కి వ‌చ్చేసింది. ఈ మ‌ధ్యే చిత్ర‌యూనిట్ తో నాగ‌చైత‌న్య కూడా జోడ‌య్యాడు. ఆయ‌న ఏఎన్నార్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.
సావిత్రి జీవితం ఆధారంగా మ‌హా న‌టి తెర‌కెక్కుతోంది. సావిత్రి జీవితం అంటే కొంద‌రి సొత్తు కాదు.. అది అంద‌రు తెలుగు వాళ్ల హ‌క్కు. ఈమె జీవితం తెరిచిన పుస్త‌కం. ఆ పుస్త‌కంలో ఉన్న విష‌యంలో తెలుసుకోడానికి ప్ర‌తీ తెలుగువాడు ఆస‌క్తి చూపిస్తూనే ఉంటాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. మాయాబజార్ సెట్ లోకి సావిత్రి పాత్ర‌ధారి అయిన కీర్తిసురేష్ వ‌చ్చి.. బాక్సు తెర‌వ‌గానే అందులోంచి సావిత్రి స్వ‌రంతో కూడిన కొన్ని డైలాగులు.. పాట‌లు వ‌స్తాయి. త‌ర్వాత కొన్ని క‌థ‌లు చ‌రిత్రే.. వాటికి అంతం ఉండ‌దంటూ రాసుంటుంది. వెంట‌నే మ‌హాన‌టి అంటూ టైటిల్ వ‌స్తుంది. ఇదంతా చూస్తుంటే సినిమా ఎంత విజువ‌ల్ వండ‌ర్ గా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ఆల‌స్యం అయినా ప‌ర్లేదు కానీ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి స‌మ్మ‌ర్ బ‌రిలోనే ఉంది కానీ కాస్త ఆల‌స్యంగా వ‌స్తుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here