ఈ మధ్య మెగా బ్రదర్స్ మధ్య మళ్లీ బాండింగ్ బాగా బలపడింది. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చిరు చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది. తమ్ముడి మనసులో ఇంత బాధ దాగుందా.. ప్రజారాజ్యం కోసం ఇంతగా మదనపడ్డాడా అని తన సన్నహితులతో చెప్పి బాధ పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తమ్ముడికి తన ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తున్నాడు మెగాస్టార్. అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తుంది. డిసెంబర్ 19న హైదరాబాద్ లోనే ఆడియో వేడుక జరగనుంది. ఇప్పటికే అనిరుధ్ స్వరపరిచిన పాటలకు అదిరిపోయే స్పందన వస్తుంది. త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో అజ్ఞాతవాసిపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ఇది పవన్ కు చివరి సినిమా అని తెలుస్తుంది. దాంతో ఘనమైన ఫేర్ వెల్ ఇవ్వాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ హైటెక్స్ లో జరగనుంది. గతంలో సర్దార్ ఆడియో వేడుక కూడా అక్కడే జరిగింది. లక్ష మంది ఫ్యాన్స్ సమక్షంలో ఈ ఆడియో జరగనుంది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తుండటం మరో విశేషం. అప్పట్లో జల్సా.. ఆ తర్వాత గబ్బర్ సింగ్.. మొన్న సర్దార్ ఆడియో వేడుకలకు వచ్చాడు చిరంజీవి. ఇప్పుడు మళ్లీ అజ్ఞాతవాసికి వచ్చి తమ్ముడికి తన ఆశీర్వాదాలు అందించనున్నాడు మెగాస్టార్. గతంలో గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు ఇద్దరు తమ్ముళ్లతో కలిసి హాజరయ్యాడు ఈ అన్నయ్య. మళ్లీ అజ్ఞాతవాసికి కూడా ముగ్గురు మెగా బ్రదర్స్ ను ఒకే వేదికపై చూస్తారో లేదో అభిమానులు.