అదేంటి.. అల్లరోన్ని పట్టుకుని అంత మాట అనేసారేంటి అనుకుంటున్నారా..? ఇది మనం అంటున్న మాటేం కాదండీ బాబూ.. భీమినేని శ్రీనివాస రావ్ అంటున్న మాట. అల్లరోడు ఒక్కడే కాదు.. సునీల్ కూడా సిల్లీఫెల్లోనే. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తున్నారు. సుడిగాడు 2 అనుకున్నారు ఈ చిత్రాన్ని ఇన్నాళ్లూ. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సిల్లీఫెల్లోస్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. తొట్టిగ్యాంగ్ తర్వాత సునీల్, అల్లరి నరేష్ మెయిన్ లీడ్ చేస్తోన్న సినిమా ఇదే. మరోవైపు ఇప్పుడు ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నరేష్ పరిస్థితి అయితే మరీనూ..!
ఏ టైమ్ లో సుడిగాడు చేసాడో కానీ అప్పట్నుంచి నరేష్ కెరీర్ లో సుడి లేకుండా పోయింది. ఆ సినిమా వరకే సుడి పనిచేసింది. ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే కానీ ఒక్క హిట్ కూడా లేదు. ఐదేళ్లైంది ఇప్పటి వరకు ఒక్క సినిమా హిట్ కాలేదు. 2012లో వచ్చిన సుడిగాడు తర్వాత ఇప్పటి వరకు మరో విజయం లేదు ఈ కుర్ర హీరోకు. మరో రాజేంద్ర ప్రసాద్ అవుతాడనుకుంటే.. ఎటు వెళ్లిపోతున్నాడో తెలియని గమ్యం వైపు వెళ్తున్నాడు అల్లరోడు. ఈయన కెరీర్ తీరం తెలియని నావలా.. చుక్కాని లేని పడవలా మారిపోయిందిప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కెరీర్ ఎక్కడైతే ఆగిపోయిందో.. అక్కడే మళ్లీ మొదలు పెడుతున్నాడు అల్లరోడు.
అల్లరి నరేష్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాటితో ఇ సత్తిబాబు.. కొత్త దర్శకుడి సినిమాలు పక్కనబెడితే భీమినేని శ్రీనివాసరావ్ తో ఓ సినిమా చేస్తున్నాడు నరేష్. ఈ చిత్రం తమిళ్లో వస్తోన్న తమిళ్ పడం 2 రీమేక్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపైనే ఇప్పుడు ఆశలన్నీ పెట్టుకున్నాడు అల్లరి నరేష్. సునీల్ కాంబినేషన్ లో అల్లరి నరేష్ చేసిన సినిమాలు బానే ఆడాయి. ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నారు ఈ ఇద్దరూ. దాంతోపాటు మహేశ్ బాబు సినిమాలోనూ అల్లరి నరేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మొత్తానికి చూడాలి ఏ సినిమాతో నరేష్ కెరీర్ మళ్లీ గాడిన పడుతుందో..?