అవును.. ఇప్పుడు విజయ్ దేవరకొండను అసలు పేరుతో ఎవరూ పిలవడం లేదు. ఆయన్ని ఇప్పటికీ అర్జున్ రెడ్డిగానే ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ప్రేక్షకులకు కూడా ఇంకా ఆ సినిమా మత్తు వదల్లేదు. దాంతో ఇప్పుడు ఈ కుర్రాడి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. అసలు విజయ్ తో సినిమా చేయాలని ఇప్పుడు దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. ఏం చేస్తాం.. ఇండస్ట్రీలో అంతే ఒక్కోసారి ఒక్కో కుర్ర హీరో టైమ్ నడుస్తుంటుంది. ఒకప్పుడు తరుణ్.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్.. తర్వాత నాని.. మొన్నటివరకు రాజ్ తరుణ్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. ఒక్కోసారి ఒక్కో హీరో వస్తుంటాడు. అందులో కొందరే నిలబడుతుంటారు.
ఇప్పుడు తన అవకాశాన్ని అంది పుచ్చుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ కుర్రాడు ఇలాంటి పాత్రలోనే సరిపోతాడు అనే లిమిటేషన్స్ లేవు.. పెళ్లిచూపులు నుంచి అర్జున్ రెడ్డి వరకు క్లాస్ మాస్ తేడా లేకుండా కుమ్మేస్తాడు. పెళ్లిచూపులుతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో అరాచకాలే చేసాడు. ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో చిన్న నిర్మాతలకు విజయ్ వరంగా మారాడు. నాని ఈ రేంజ్ నుంచి స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు విజయ్ ఇదే దారిలో నడుస్తున్నాడు. విజయ్ డేట్స్ కోసం ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే గీతాఆర్ట్స్ లో వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు విజయ్.
అల్లు అరవింద్ నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. దీనికి గీతాగోవిందం అనే టైటిల్ పెట్టారు. దీంతోపాటు త్రివిక్రమ్ నిర్మాణంలో నందినిరెడ్డి దర్శకురాలిగా మరో సినిమా చేస్తున్నాడు. దాంతోపాటు భరత్ కమ్మ.. రాహుల్ సంక్రీత్యన్ అనే కొత్త దర్శకులతోనూ సినిమాలకు కమిటయ్యాడు ఈ కుర్ర హీరో. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తో ఓ బై లింగువల్ ప్రాడక్ట్ కు విజయ్ ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఈయన గతంలో విక్రమ్ తో ఇంకొక్కడు సినిమా చేసాడు. ఇలా విజయ్ డేట్స్ ఇప్పుడు హాట్ కేక్ లా మారిపో యాయి.