సాధారణంగా అమ్మాయిలను చూసి అబ్బా ఏముందిరా పిల్లా అంటుంటారు. కానీ అబ్బాయి విషయంలో మాత్రం అది జరగదు. ఎంత బాగున్నా కూడా కత్తిలా ఉన్నాడురా బాబూ అనలేరు. అనడం కూడా బాగుండదు. కానీ ఇప్పుడు ఇక్కడ విజయ్ దేవరకొండను చూసిన తర్వాత అలా అనకపోతే కష్టమే. ఎందుకంటే మనోడి జోరు చూసి.. స్టైల్ చూసి ఇప్పుడు ఇంతకంటే మాటలు కూడా లేవు. అమ్మాయిలైతే ఈ అర్జున్ రెడ్డిని చూసి ఫిదా కాకపోతే కష్టమే. బాలీవుడ్ హీరోలు కూడా కుళ్ళుకునేలా మేకోవర్ అయిపోయాడు ఈ కుర్ర హీరో. పక్కా స్టైలిష్ లుక్ తో విజయ్ చేసిన ఫోటోషూట్ ఒకటి ఇప్పుడు విడుదలైంది. ఓవైపు సినిమాలతో పాటే మరోవైపు ఫోటోషూట్లతోనూ రచ్చ చేస్తున్నాడు విజయ్. ప్రస్తుతం ఈయన తెలుగు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు.
ఏ అండ లేకుండా వచ్చి ఇక్కడ నిలబడడం అంటే చిన్న విషయం కాదు. అప్పట్లో చిరంజీవి.. ఆ తర్వాత రవితేజ.. ఇప్పుడు నాని.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. ఇలా ఏ పుష్కరానికో ఒక్క హీరో నిలబడిపోతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో అరాచకాలే చేసాడు. ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో చిన్న నిర్మాతలకు విజయ్ వరంగా మారాడు. నాని ఈ రేంజ్ నుంచి స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు విజయ్ ఇదే దారిలో నడుస్తున్నాడు. విజయ్ డేట్స్ కోసం ఇండస్ట్రీలో చాలా మంది అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే గీతాఆర్ట్స్ లో వరసగా రెండు సినిమాలు చేస్తున్నాడు విజయ్.
అల్లు అరవింద్ నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తైంది. దీంతోపాటు త్రివిక్రమ్ నిర్మాణంలో నందినిరెడ్డి దర్శకురాలిగా మరో సినిమా చేస్తున్నాడు. దాంతోపాటు భరత్ కమ్మ.. రాహుల్ సంక్రీత్యన్ అనే కొత్త దర్శకులతోనూ సినిమాలకు కమిటయ్యాడు ఈ కుర్ర హీరో. దానికితోడు ఆ మధ్య ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఓ బైలింగువల్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు విజయ్. దాంతో పాటు బాబీతో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇవన్నీ గానీ హిట్టైతే విజయ్ దేవరకొండను పట్టుకోవడం కష్టం. మొత్తానికి విజయ్ దూకుడు చూసి ఇప్పుడు అంతా అంటోన్న మాట ఒక్కటే.. అర్జున్ రెడ్డి.. నో బ్రేక్స్ ఎట్ ఆల్..!