క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా.. ఈ పదం వాడాలంటే ఆమెకు ఓ అర్హత ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకు వాడే పదం కాదిది. నిజానికి ఒక్క శ్రీదేవికి తప్ప ఇంకెవరికీ ఇవ్వలేని బిరుదు ఇది. ఎందుకంటే ఆసేతు హిమాచలం నెంబర్ వన్ హీరోయిన్ గా ఏలిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి మాత్రమే. అతిలోకసుందరి మాయకు అన్ని ఇండస్ట్రీలు మోకరిల్లాయి. ఆమె అందానికి ముగ్ధుడు కాని ప్రేక్షకుడు లేడు. ఆమె అతిలోక సౌందర్యాన్ని చూసి ఆహా అంటూ అహో రాత్రులు ఆమె జపంతోనే మురిసిపోయిన అభిమానులు ఎందరో. నాలుగేళ్ల చిరు ప్రాయంలోనే 1967వ సంవత్సరంలో నటన మొదలుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత 300 సినిమాల్లో మెప్పించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ అనే తేడా లేకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ నెంబర్ వన్ అనిపించుకుంది. ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక్క హీరోయిన్ శ్రీదేవి.
ఈ రోజుల్లో పదేళ్లు ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో ఉంటేనే అబ్బో అద్భుతం అంటున్నాం మనం. మరి శ్రీదేవి 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికీ ఆమెకు ఇమేజ్ ఇంత కూడా తగ్గలేదు. అదీ అతిలోకసుందరి స్టామినా. ఇండియన్ సినిమాలోనే కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇంతటి కెరీర్ ఉన్న హీరోయిన్ మరొకరు ఉండరు. ఆమె జీవిత కాలం 54 ఏళ్లైతే.. అందులో 50 ఏళ్లు కళామతల్లి ఒడిలోనే ఉంది. ఈ మధ్యే అందర్నీ శోకసంద్రంలో ముంచేస్తూ కన్ను మూసింది శ్రీదేవి. ఆమె చనిపోయిన తర్వాత వచ్చిన తొలి జయంతి ఇది. ఆగస్ట్ 13న ఈమె జయంతి.
తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో కలిపి 300 సినిమాలు చేసింది శ్రీదేవి. గతేడాది వచ్చిన మామ్ సినిమా ఆమెకు 300వ సినిమా కావడం విశేషం. ఇది శ్రీదేవి కెరీర్ 50 ఏళ్ల సందర్భంగా వచ్చిన సినిమా కావడంతో బోనీకపూర్ భార్యకు స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా.. నటిగా శ్రీదేవి కెరీర్ ను మరింత ఎత్తుకు చేర్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే మరో శ్రీదేవి రావడం అనేది అసాధ్యం. అది కలలో కూడా సాధ్యం కాని పని. ఆమె కూతుళ్లు కూడా శ్రీదేవిలా మాయ చేయడం సాధ్యం కాదు. మొత్తానికి క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది శ్రీదేవి.